జ్ఞానేశ్ కుమార్ ఎందుకు రాజీనామా చేయడం లేదు?

3
- Advertisement -

ఎన్నికల కమిషనర్‌గా జరిగిన వ్యవహారాలపై జ్ఞానేశ్ కుమార్ సమాధానం చెప్పాల్సిందేనని కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన రాజీనామా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మరోవైపు, ఇండియా కూటమి నిరసనల నేపథ్యంలో ఢిల్లీని కోటలా మార్చేశారని, యువతను అడ్డుకుంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులను స్వేచ్ఛగా తిరగనివ్వడం ఏమిటని నిలదీశారు.

ఓటు చోరీ ఆరోపణలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన నిరసనల సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన ప్రశ్నలనే తాము అడుగుతున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ వ్యవహారశైలిపై లక్షలాది మంది ప్రశ్నలు సంధిస్తున్నారని, ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పేర్కొన్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా ఎందుకు చేయడం లేదని రాహుల్ ప్రశ్నించారు. తమ ప్రశ్నల నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషనర్‌గా జరిగిన వ్యవహారాలపై సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు ఆగబోవని, వారు నిరంతరం నిలదీస్తూనే ఉంటారని అన్నారు.

Also Read:రాహుల్‌తో భేటీకి సీజేఐ నో!

నిరసనల్లో పాల్గొనేందుకు వస్తున్న యువతను పోలీసులు అడ్డుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. యువతను అడ్డుకుంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులను మాత్రం స్వేచ్ఛగా తిరగనివ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ అంశంపై పోలీసు శాఖలోనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని, హోంమంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీల్లోనూ దీనిపై చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.

నిరసనలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో భారీగా పోలీసులను మోహరించారని రాహుల్ గాంధీ విమర్శించారు. నగరాన్ని కోటలా మార్చేశారని, ఢిల్లీకి చేరుకోవాలనుకునే ప్రజలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రైళ్లు, బస్సులను నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించుతున్నారని అన్నారు. ఢిల్లీ వీధుల్లో 20 వేల నుంచి 30 వేల మంది పోలీసులను మోహరించినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ చర్యలతో దేశంలో నెలకొన్న పరిస్థితులను, వాస్తవాలను ప్రజలకు చూపించాలనుకుంటున్నామని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.

- Advertisement -