ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ (DUSU) ఎన్నికల్లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ‘నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (NSUI) ఘోర ఓటమిని మూటగట్టుకోవడంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో NSUI ఇన్‌ఛార్జ్ కన్హయ్యా కుమార్, NSUI జాతీయ అధ్యక్షుడు వినోద్ జక్కడ్‌లను పిలిపించి రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రశ్నించారు.
నాలుగు ప్రధాన సెంట్రల్ ప్యానెల్ స్థానాల్లో NSUI ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ABVP ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ స్థానాలను దక్కించుకోగా, వైస్ ప్రెసిడెంట్ స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి దీపాంశు శోకీన్ గెలుచుకున్నారు. NSUI నుండి బయటకు వచ్చి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి వైస్ ప్రెసిడెంట్‌గా గెలిచిన దీపాంశు శోకీన్‌ను పార్టీలో ఎందుకు ఉంచలేకపోయారని రాహుల్ గాంధీ నేతలను ప్రశ్నించారు.
శోకీన్ పెట్టిన నిబంధనలు, షరతులు అంగీకరించదగినవిగా లేవని కన్హయ్యా కుమార్, జక్కడ్‌లు రాహుల్‌కు వివరించారు. అయితే ఈ వివాదాన్ని సరిగ్గా పరిష్కరించలేకపోయారని ఈ విషయాన్ని హ్యాండిల్ చేసిన విధానంపై రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు.
ఒకవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా యువత (Gen-Z) ని కలుస్తూ వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంటే దేశ రాజధానిలోని ప్రధాన విశ్వవిద్యాలయం DUSUలో ఇలాంటి ఫలితం రావడంపై రాహుల్ తీవ్రంగా స్పందించారు. అలాగే విద్యాసంస్థలను ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుంటోందని, విద్యార్థుల సమస్యలను క్షేత్రస్థాయి నుంచి లేవనెత్తుతూ వారికి అవగాహన కల్పించాలని రాహుల్ గాంధీ నాయకులకు సూచించారు.
Also Read:చైనాకు అమెరికా ఆయుధాలు!

