వాషింగ్టన్, బీజింగ్‌ల మధ్య ఉన్న సంక్లిష్ట సైనిక సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తైవాన్‌కు అమెరికా ఆయుధాల విక్రయం గురించి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చిస్తున్న సమయంలో.. “మీకేమైనా అమెరికా ఆయుధాలు కావాలా?” అని ట్రంప్ నేరుగా జిన్‌పింగ్‌ను అడిగినట్లు సమాచారం వెలువడింది. ఎఫ్-35 ఫైటర్ జెట్ విడిభాగాలను దారిమళ్లించి హాంకాంగ్‌కు పంపిన ఉదంతంపై అమెరికా దర్యాప్తు జరుపుతున్న సమయంలోనే ఈ వ్యాఖ్యలు వెలుగులోకి రావడం గమనార్హం.
తైవాన్‌కు ఆయుధాల విక్రయం అనేది అసాధారణమైన విషయమేమీ కాదని జిన్‌పింగ్‌కు వివరించే క్రమంలో ట్రంప్ ఈ ఆఫర్ ఇచ్చారని చైనాలోని అమెరికా రాయబారి డేవిడ్ పెర్డ్యూ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు అమెరికా ఆయుధాలను విక్రయిస్తుందని, ఆ క్రమంలోనే చైనా అధ్యక్షుడిని కూడా కొన్ని ఆయుధాలు కొనుగోలు చేస్తారా అని అడిగారని పెర్డ్యూ తెలిపారు. అయితే ట్రంప్ ఈ వ్యాఖ్యలు ఎప్పుడు చేశారు, నిజంగానే ఆయుధాలు అమ్మాలనే ఉద్దేశంతో అన్నారా లేదా సరదాగా అన్నారా అనే విషయాన్ని పెర్డ్యూ స్పష్టం చేయలేదు. చైనాను అమెరికా తన ప్రధాన వ్యూహాత్మక, సైనిక ప్రత్యర్థిగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ట్రంప్ వ్యాఖ్యల ప్రాముఖ్యత ఏమిటి?
అమెరికా రక్షణ రంగానికి సంబంధించి అత్యంత సున్నితమైన సైనిక సాంకేతికత చైనా చేతుల్లోకి వెళ్లకుండా వాషింగ్టన్ చాలా ఏళ్లుగా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఆస్ట్రేలియా నుండి మరమ్మతుల కోసం అమెరికాకు పంపిన ఎఫ్-35 ఫైటర్ జెట్ విడిభాగాలు దారిమల్లి హాంకాంగ్‌కు చేరుకున్నాయనే కథనాలపై అమెరికా దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు రావడం ఆశ్చర్యపరిచింది.
Also Read:పొంగులేటిపై ఈడీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
హాంకాంగ్ చేరిన ఆ భాగాలలో ఎఫ్-35 కాక్‌పిట్ కెనోపీ (గ్లాస్ కవర్), వెపన్స్-బే డోర్ (ఆయుధాల విభాగం తలుపులు) ఉన్నట్లు సమాచారం. ఎఫ్-35 అనేది అమెరికా తయారు చేసిన అత్యంత శక్తివంతమైన స్టీల్త్ ఫైటర్ విమానం. ఈ విడిభాగాల ద్వారా రడార్‌కు దొరకకుండా ఉండే స్టీల్త్ టెక్నాలజీ చైనాకు చిక్కుతుందేమోనని అమెరికా ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ స్పందిస్తూ.. అవి అంత సున్నితమైన విడిభాగాలు కావని తమకు తెలిసిందని చెప్పారు. పెంటగాన్ కూడా ఈ భాగాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తోంది.

