ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించతలపెట్టిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమానికి సంబంధించి ఎదురైన అవరోధాలు తొలగిపోయాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్థానిక యంత్రాంగం మరియు కేపీ కాలేజ్ మేనేజ్‌మెంట్ తుది అనుమతి ఇచ్చాయి. దీంతో ఆగస్టు 8న జరగనున్న ఈ విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమానికి మార్గం సుగమమైంది.
ప్రయాగ్‌రాజ్‌లోని కేపీ కాలేజ్ మైదానంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే విద్యార్థుల విద్యా కార్యకలాపాలకు భంగం కలగకూడదన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు, వర్షాల కారణంగా మైదానం దెబ్బతింటుందనే ఆందోళనలను పేర్కొంటూ కాలేజీ మేనేజ్‌మెంట్ గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. అయితే తాజా పరిణామాలతో ఆ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుని మళ్లీ బుకింగ్‌ను పునరుద్ధరించారు.
ఈ క్రమంలో రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అడ్మినిస్ట్రేషన్ ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించిందని ఆరోపించారు. అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు ఫీజుల పెంపు, సీట్ల కోతకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, వారి సమస్యలను వినడానికి బదులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా విద్యార్థుల, యువత గొంతుకగా తాను నిలబడతానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందిస్తూ, విద్యార్థుల సమవేశం అంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో అర్థం కావడం లేదన్నారు. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్, పవన్ ఖేరా తదితర నేతలు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘ఛాత్రోం కీ గూంజ్’ ప్రచారం రాజస్థాన్‌లోని కోటాలో “ఛాత్రోం కీ గూంజ్ మహా ర్యాలీ”తో మొదలైంది. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగింది. ఇప్పుడు మూడో దశగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులతో నేరుగా సంభాషించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Also Read:వర్షాలతో అలెర్జీ..వీటితో చెక్!

