టాలీవుడ్లో ఇప్పుడు డ్రగ్స్ కేసు సంచలనం రేపుతోంది. ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న వార్తలతో టాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
అయితే ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులను సిట్ విచారించడం స్టార్ట్ చేసింది. ఇదిలావుంటే, తాజాగా డ్రగ్స్ వ్యవహారంపై ప్రముఖ టాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణమూర్తి తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు.
డ్రగ్స్ విషయంలో సినిమా రంగాన్ని టార్గెట్ చేయడం సరికాదని, సిట్, మీడియా వాళ్లు సినిమాలు తీసే మాకే సినిమా చూపిస్తున్నారని ఆర్ నారాయణమూర్తి అన్నారు. డ్రగ్స్ వాడకం 1960 నుంచి దేశంలో ఉందని.. ఇప్పుడు డ్రగ్స్ కేవలం సినిమా వాళ్లే వాడుతున్నారనే భ్రమ కలిగిస్తున్నారని వాపోయారు.
రాజకీయ నేతల పిల్లలు, ఉద్యోగులు, వ్యాపారులు డ్రగ్స్ వాడుతున్నారన్నారు. డ్రగ్స్ అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, డ్రగ్స్ మూలాలు వెతికి అరికట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్‌కి బానిసలుగా మారడం బాధాకరమని ఆర్.నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.