ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరా నివాసం మరియు ఇతర కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు.
ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఇటువంటి రాజకీయ ఎత్తుగడలకు పంజాబ్ ఎన్నటికీ తలవంచదు. దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం బీజేపీకి అలవాటుగా మారింది అని మాన్ విమర్శించారు. విపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇటువంటి ఒత్తిళ్లకు లొంగదని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక భూ కేటాయింపు వ్యవహారంలో మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆప్ నాయకత్వం ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలో లేదా రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు బీజేపీ ఇలాంటి ‘సంస్థల’ను ప్రయోగిస్తోందని భగవంత్ మాన్ ధ్వజమెత్తారు. ప్రస్తుతం పంజాబ్‌లో ఈ ఈడీ సోదాలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి.
Also Read:దేశ ఆత్మగౌరవానికి నిదర్శనం..సోమనాథ్ ఆలయం

