ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు కేఎల్ఐ – పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు గువ్వల బాల్ రాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జైపాల్ యాదవ్, బీరం హర్షవర్దన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, సీఈలు హమీద్ ఖాన్, రమేష్, రఘునాధ్ రావు గార్లు, ఎస్ఈలు సత్యశీలారెడ్డి, ఎ.సత్యనారాయణ రెడ్డి, డీఈలు, ఈఈలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రి మాట్లాడారు. కల్వకుర్తి కాలువలకు పాలమూరు నీళ్లు అందిస్తున్నం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం వట్టెం ద్వారా 1850 క్యూసెక్కుల నీళ్లు కాలువకు వదులుతున్నాం. దీంతో కల్వకుర్తి ఆయకట్టు పెరిగింది. ఇప్పుడున్న కాల్వల సామర్ద్యం సరిపోదు. అయిదు పంపులు నడిపే అవకాశం ఉన్నా.. గత ప్రభుత్వాలు కాల్వల సామర్ద్యం తక్కువ చేసి నిర్మించడం మూలంగా ప్రస్తుతం ఉన్న ఆయకట్టుకు నీరందించండం సాధ్యం కావడం లేదని మంత్రి తెలిపారు.
కేఎల్ఐలో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే ప్రతిపాదించి నిర్మించారు. కానీ నేడు ఆయకట్టు విస్తీర్ణం 5 లక్షల ఎకరాలకు చేరుకుంది. పంపులున్నా కాలువల ద్వారా నీళ్లు తీసుకువెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పనులు చివరిదశకు చేరుకున్నాయి.ఈ నేపథ్యంలో కేఎల్ఐ అదనపు ఆయకట్టుకు పాలమూరు – రంగారెడ్డిలోని వట్టెం రిజర్వాయర్ నుండి నీళ్లందించాలని వచ్చిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు అని మంత్రి అన్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ సామర్ద్యం లక్షా 80 వేల ఎకరాలకు ప్రతిపాదించబడింది.. నేడు ఈ కాలువ కింద ఆయకట్టు 3 లక్షల ఎకరాలు దాటింది. అందుకే వట్టెం రిజర్వాయరు నుండి నీరందించనున్నారు. తక్కువ ముంపుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించేలా రిజర్వాయర్లు నిర్మించాలని అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. అలాగే గణపసముద్రం చెరువు కట్టను విస్తరించాలి. డి8 ,పసుపుల బ్రాంచ్ కెనాల్, డీ5 లను విస్తరించాలని నిర్ణయించారు.
ఖిల్లాఘణపురం మండలం షాపూర్ వద్ద వయోడక్ట్ వెంటనే పూర్తిచేసి రాబోయే వానాకాలంలో అడ్డాకుల వరకు సాగునీరు అందించాలి. బుద్దారం కాలువపై పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసి ఆయకట్టుకు టెండర్లు పిలవాలి. కేఎల్ఐ పంపులను ఆపిన వెంటనే అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలి. అన్ని చెరువులను కాలువల పరిధిలోకి తీసుకురావాలని మంత్రి సూచించారు.