అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రతిపాదించిన భారీ జలవిద్యుత్ ప్రాజెక్టుపై స్థానికుల నిరసనలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. సియాంగ్ లోయలో చేపట్టనున్న 11,200 మెగావాట్ల సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు (SUMP)కు సంబంధించి సర్వేలు, డ్రిల్లింగ్ పనుల కోసం భద్రతా బలగాలు రంగంలోకి దిగడంతో వివాదం మరింత ముదిరింది. ఈ ప్రాజెక్టు వల్ల తమ భూములు, జీవనోపాధి, సంప్రదాయ జీవన విధానం దెబ్బతింటాయని స్థానిక ఆదివాసీ సమాజాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సియాంగ్ లోయలోని ఉగెంగ్-కొంకర్ ప్రాంతంలో ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (PFR) తయారీ కోసం సర్వేలు, డ్రిల్లింగ్ నిర్వహించేందుకు సుమారు నెల రోజుల క్రితం భద్రతా సిబ్బంది వెళ్లారు. దీనిపై స్థానికుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరసనకారులపై కఠిన చట్టాల ప్రయోగం, అదుపులోకి తీసుకోవడం వంటి పరిణామాలు తమ ఆందోళనలను మరింత పెంచుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
అక్టోబర్ 14న నలుగురు నిరసనకారులను అరుణాచల్ ప్రదేశ్ అన్‌లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) చట్టం, 2014 కింద అదుపులోకి తీసుకోవడం తాజా ఆందోళనలకు కారణమైంది. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానికుల నిరసనలు కొనసాగుతున్నాయి. చైనాలోని టిబెట్ ప్రాంతంలో యార్లుంగ్ త్సాంగ్పో నదిపై భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికలు భారత్‌లోనూ ఆందోళనలకు కారణమవుతున్నాయి. ఆ నది అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిన తర్వాత సియాంగ్‌గా ప్రవహిస్తుంది. అనంతరం ఇతర నదులతో కలసి బ్రహ్మపుత్రగా మారుతుంది.
Also Read:కిమ్ జోంగ్ ఉన్‌తో ట్రంప్ భేటీ!
చైనా ఎగువ ప్రాంతంలో చేపట్టే భారీ ప్రాజెక్టుల ప్రభావాలను ఎదుర్కోవడానికి సియాంగ్ ప్రాజెక్టు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే, ఈ ప్రాజెక్టు కారణంగా పర్యావరణానికి నష్టం వాటిల్లడంతోపాటు, స్థానిక ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని వ్యతిరేకులు ఆందోళన చెందుతున్నారు.

