జాతీయ ఉద్యమానికి రామగుండంలోనే నాంది
ప్రభుత్వ సంస్థల పరిరక్షణే ఎజెండా
సింగరేణిలో ప్రైవేటీకరణకు బీజాలు
అమ్మకానికి మరోపేరే పెట్టుబడుల ఉపసంహరణ
36 సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ
వీలైతే అమ్మకం, లేకుంటే ప్రైవేటీకరణ
అదే కేంద్ర ప్రభుత్వ పాలసీ
పార్లమెంటుకు నివేదించిన ఆర్ధికమంత్రి
ఎలాంటి దాపరికం లేకుండా అమ్మకాలు
అమ్మకాలు, ప్రైవేటీకరణలపై అంతా ఓవెన్
ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముకోవాలనే కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జాతీయస్థాయిలో ఉద్యమాలు జరిపేందుకు రామగుండం నుంచే తొలి అడుగు వేయడానికి కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఏక్య పోరాటాలకు నాంది పలికాయి. అందులో భాగంగానే కేంద్రం 36 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిన వైనాన్ని ఆయా సంఘాల నాయకులు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేశారు.
ఈ నెల 12వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామగుండం వస్తున్నందున కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ నిరసనలు తెలియజేయడమే కాకుండా ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతున్నామని ఆయా సంఘాల నాయకులు ప్రకటించారు. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు జాతీయస్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. దేశాన్ని అభివృద్ధి చేయడమంటే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టడం, అలా వీలుకాకపోతే పైవేటీకరించడమనే సరికొత్త నిర్వచనాన్ని రూపొందించిన కేంద్ర ప్రభుత్వ విధానాలు జాతీయస్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి.
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, ప్రైవేటీకరణల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆత్మనిర్బర్ భారత్’ (పి.ఎస్.ఇ) జాబితా తాజాగా వైరల్ అయ్యింది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్టైజెస్ (సి.పి.ఎస్.ఇ)లలో 2016వ సంవత్సరం నుంచి ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న వాటిలో ఈపడాదిలో 36 సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకొంటున్నట్లుగా కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గత ఆగస్టు 8వ తేదీన నిండు లోక్ సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబులో పేర్కొన్న వివరాలన్జీ దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం పొందుతున్నాయి.
ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్నా, అమ్మకానికి పెట్టాలన్నా ఆయా సంస్థలు ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నాయని, ఎస్టాబ్లిష్ చేసి వదిలించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఈ ఆత్మనిర్బర్ భారత్ పథకాన్ని తీసుకొచ్చిందని, అమ్మకానికి పెట్టిన కంపెనీలను మహారత్న, నవరత్న, మినీరత్న అనే పేర్లతో మూడు కేటగిరీలుగా విభజించారు. అవగే అమ్మకాలకు సంబంధించిన ప్రాసెస్లో ఉన్నాయి. ఇందులో పది సంస్థల అమ్మకాల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అందులో హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్.పి.సి.ఎల్), గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ (ఆర్.ఇ.సి.ఎల్) ఎయిర్ ఇండియా, బ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, కామ్ రాజర్ పోర్టు లిమిటెడ్, ఈశాన్య రాష్ట్రాల విద్యుత్తు కార్పోరేషన్ లిమిటెడ్, నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వంటి కంపెనీలు పది ఉన్నాయి. దేశ ప్రజలకు సుపరిచితమైన ఎయిర్ ఇండియాను టాటా కంపెనీ స్వాధీనం చేసుకొంది. లాభాల్లో ఉన్న హెచ్.పి.సి.ఎల్ ను కూడా అమ్మకాలకు పెట్టడం జాతీయస్థాయిలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. పెట్రో ఉత్పత్తులను దేశ ప్రజలకు అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న హెచ్.పి.సి.ఎల్.కున్న ఆర్ధిక లావాదేవీల్లో ఎలాంటి నష్టాల్లేకుండా కంపెనీ నడుస్తున్నదని, ఆయిల్ కంపెనీల నష్టాలను తగ్గించడానికి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఎప్పటికప్పుడు పెంచుకొంటూ పోతూ మళ్ళీ ఇలా అమ్మకానికి పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినవాళ్ళకు ఆయిల్ కంపెనీలను అప్పగించడానికే ఇలా కుట్ర పూరితంగా కేంద్రం వ్యవహరిస్తోందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి.
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సి.ఇ.ఎల్), రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ వంటి సంస్థలను కూడా అమ్మకానికి పెట్టిన కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో సింగరేణి కాలరీస్ ను కూడా అమ్మకానికి పెడుతుందని, లేకుంటే ప్రైవేటీకరిస్తుందని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు గట్టిగా విశ్వసిస్తున్నారని, అందుకే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవడానికే ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనను అడ్డుకోవాలని నిర్ణయించుకొన్నట్లుగా ఆయా పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ముక్తకంఠంతో ప్రకటించారు. సాధారణంగా దేశాన్ని పాలించే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడమే కాకుండా, కొత్తగా సంస్థలు, కంపె నీలను ఏర్పాటు చేసి దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యను తీర్చడానికి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, ప్రజల్లో ఎకనమిక్ యాక్టివిటీని పెంపొందించడానికి ప్రయత్నాలు చేస్తుంటాయని, కానీ ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం మాత్రం వాటన్నింటికీ తిలోదకాలిచ్చి కొత్త కంపె నీలను ఏర్పాటు చేయకపోగా ఉన్న కంపెనీలు, సంస్థలను కూడా నష్టాలొస్తున్నాయనే కుంటిసాకుతో అమ్మకానికి పెట్టడం…లేదంటే ప్రైవేటీకరించడానికి పూనుకొంటోందని, అందుకే ప్రధానమంత్రి పర్యటనలకు ఉమ్మడిగా ఆందోళనలు చేయాల్సి వస్తోందని ఆయా సంఘాల నాయకులు గట్టిగా చెబుతున్నారు. అయినవారికి ప్రభుత్వరంగ సంస్థలు, కంపెనీలను అప్పగించాలంటే ఆయా కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వానికి భారంగా మారాయని ముద్రవేస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే జాతీయస్థాయిలో ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నామని ఆ నాయకులు వివరించారు.
ఇవి కూడా చదవండి..