‘అఖండ’విజువల్ వండర్‌: మిర్యాల రవిందర్ రెడ్డి

132
ravinder reddy
- Advertisement -

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

కరోనా రాక ముందే ఈ సినిమాను ప్రారంభించాం. కరోనా సమయంలో టీజర్ విడుదల చేశాం. ఫస్ట్ లాక్డౌన్ అయ్యాక షూటింగ్ చేశాం. సెకండ లాక్డౌన్‌లో చిన్న టీజర్ విడుదల చేశాం. సెకండ్ లాక్డౌన్ తరువాత క్లైమాక్స్ షూట్ చేశాం. అన్ని కరోనాల తరువాత ఇప్పుడు సినిమాను విడుదల చేస్తున్నాం. పెద్ద సినిమాల ప్రయాణం ఎలా ఉండబోతోందనేది అఖండతోనే తెలుస్తుంది.

బాలకృష్ణ గారితో జర్నీని మాటల్లో చెప్పలేను. బయట మాట్లాడుకునే బాలకృష్ణ గారు వేరు. ఆయనతో కలిసి ట్రావెల్ చేశాక కనిపించే బాలకృష్ణ గారు వేరు. స్క్రీన్ మీద బాలకృష్ణ వేరు.

ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. సెకండ్ లాక్డౌన్ కంటే ముందే సినిమా అంతా పూర్తయింది. కానీ క్లైమాక్స్, ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సినిమా పూర్తయ్యాక ఇక ఎన్ని రోజులు అని ఎదురుచూస్తుంటాం. ఓటీటీ నుంచి కూడా చాలా ఆఫర్లు వచ్చాయి. ఇలాంటి సినిమాను థియేటర్లో చూస్తేనే కరెక్ట్ అని నిర్ణయించుకున్నాం. ఒక పెద్ద సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తే రెవెన్యూ, రెస్పాన్స్ ఎలా ఉంటుందని అందరికీ అనుమానాలున్నాయి. కానీ మేం ముందడుగు వేశాం. ఎవరో ఒకరు అడుగు వేయాలి కదా?. ఫస్ట్ లాక్డౌన్ తరువాత క్రాక్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సెకండ్ లాక్డౌన్ తరువాత మనం వస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్ చూస్తే కరోనా లేదని అనుకుంటారు. మళ్లీ పూర్వ వైభవం వస్తుంది.

డిస్ట్రిబ్యూటర్లందరూ కలిసి విడుదల తేదీని నిర్ణయించారు. మేం డిసెంబర్ 24న రావాలని అనుకున్నాం. కానీ డిసెంబర్ 2 అనేది సరైన తేదీ అని అంతా అనుకున్నారు.

సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తరువాత.. చివరి వరకు అలా చూస్తుండిపోతారు. విజువల్ వండర్‌గా ఉంటుంది.

ఏ సినిమాకైనా కథే ముందు. ఆ తరువాతే స్టార్ హీరో అయినా స్టార్ డైరెక్టర్ అయినా. అయితే పెద్ద హీరోలకు కథ లైన్‌గా ఉన్నా పర్లేదు. వారే మోస్తారు. వారి అభిమానులు ముందుకు తీసుకెళ్తారు.

బాలకృష్ణ గారి వందో సినిమాను బోయపాటి గారు చేయాలి. లెజెండ్ సినిమా సమయంలోనే మహజ్జాతకుడు అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా కథను బాలకృష్ణ గారికి బోయపాటి గారు వినిపించారు. అన్నీ కుదిరాయి. ద్వారకా క్రియేషన్స్, రవీందర్ రెడ్డిగారితో చేద్దామని బాలకృష్ణతో బోయపాటి గారు అన్నారు.

అఖండ అంటే అనంతం.. కాదనలేని సత్యం. సినిమా చూశాక.. ఆ టైటిల్ ఎందుకు పెట్టారా? అని తెలుస్తుంది. కథకు టైటిల్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.

అఘోరాలు అంటే సమాజానికి సంబంధం లేని వ్యక్తులు కాదు. వారు వ్యక్తిగతం కన్నా.. దైవం, ప్రకృతి వాటిపై రియాక్ట్ అవుతుంటారు. అలాంటి కారెక్టర్ రావడం, సమస్యలను పరిష్కరించడమనేది కథ.

బోయపాటి గారి కెరీర్‌లో, బాలకృష్ణ గారి కెరీర్‌లో ఇంత వరకు ఇన్ని స్క్రీన్‌లో విడుదలైన సినిమా మరొక్కటి లేదేమో. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లో అఖండ రావొచ్చు. ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో విడుదలవుతోంది. మెల్‌బోర్న్‌లో అయితే బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటకే ఫుల్ అయిపోయాయి.

సినిమా అంటే వ్యక్తిగతం, మన నలుగురికి మాత్రమే సంబంధించింది. వాళ్లు తీసుకునే నిర్ణయాలు వారికి కరెక్ట్ అనిపించొచ్చు. మనకు ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మనం గౌరవించాల్సిందే.

కరోనా, టిక్కెట్ల రేట్ల పెంపు అనేవి లేనప్పుడు ఈ సినిమాను ప్రారంభించాం. దానికి తగ్గట్టే బడ్జెట్ అనుకున్నాం. కానీ పరిస్థితుల వల్ల బడ్జెట్ పెరిగింది. ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం మాకు అంత లాభం రాకపోవచ్చు.

కరోనా వల్ల బయటకు వెళ్లి షూటింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇక్కడే సెట్స్ వేసి చేశాం. క్లైమాక్స్‌ను అరుణాచలంలోని ఓ గుడిలో షూట్ చేశాం. ఆ టెంపుల్ అద్భుతంగా ఉంటుంది.

ఇందులో రెండు పాత్రలు అని చూడకూడదు. ఆ రెండో పాత్ర సూపర్ మ్యాన్. మనిషికి ఎక్కువ దేవుడికి తక్కువ. సూపర్ హీరో.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తులో ప్లాన్ చేశాం. కానీ బాలకృష్ణ గారికి సర్జరీ జరగడంతో సింపుల్‌గా చేయాలని అనుకున్నాం. అందుకే శిల్పా కళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశాం.

లెజెండ్ సినిమాతో జగపతి బాబు కెరీర్ ఎలా టర్న్ తీసుకుందో.. అఖండ సినిమాతో శ్రీకాంత్ కెరీర్ టర్న్ అవుతుంది. ఈ చిత్రంలో జగపతి బాబు గారు కూడా ఉన్నారు. కొన్ని సీన్లే ఉంటాయి. కానీ సినిమాను గైడ్ చేసే ఇంపార్టెంట్ రోల్ పోషించారు.

మేం నమ్మినదాని కంటే.. ఎక్కువగా తమన్ నమ్మాడు. అనుకున్న దాని కంటే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా రిలీజ్ తరువాత తమన్ గురించి మాట్లాడుకునేది ఎక్కువగా ఉంటుంది.

హీరోయిన్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా ఇచ్చి ఇలా వెళ్లే పాత్ర కాదు.

కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో అలాంటి సినిమాలే చేస్తాను. రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

- Advertisement -