బడి నుంచి గెంటేశారు…అమెరికా రమ్మంది!

257
america study
- Advertisement -

ఆర్థిక సమస్యలూ, ఆకలి బాధా…అమ్మానాన్నలకు అవమానాలు…అన్నీ ఆ గి అమ్మాయికి తెలుసు…అన్నింటినీ దూరం చేయాలంటే…చదువుకోవడమే పరిష్కారమనుకుంది. అందుకే కష్టపడింది. ఇప్పుడు ఆమెరికాలో ఉచిత విద్యను అభ్యసించే అవకాశాన్ని దక్కించుకుంది. డిగ్రీ చదువుతూ… ఏడాది విరామం తీసుకుని అమెరికా ప్రభుత్వం ఇచ్చిన అరుదైన అవకాశాన్ని అందుకోవడానికి వెళుతోన్న ప్రియాంక జీవితం ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శం.

మేం బతుకుదెరువు కోసం వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి స్థిరపడాం. నాన్న కూలీ. అమ్మ బాలానగర్‌ ఏసీపీ కార్యాలయంలో స్వీపర్‌. మేం ముగ్గురం పిల్లలం. నాకో చెల్లీ, తమ్ముడూ. అమ్మానాన్నలిద్దరూ రెక్కలు ముక్కలు చేసుకుంటేనే మా కుటుంబం గడిచేది. నా చిన్నప్పుడు ఒకపూట తింటే మరోపూట పస్తులున్న రోజులు నాకు ఇప్పటికీ గుర్తే. కొన్నిసార్లు మా అమ్మ వీధి చివరన ఉన్న దుకాణంలో నూకలు తెచ్చి వండి పెట్టేది. కూరగాయలు కొనే స్థోమత లేక కారంతోనే సరిపెట్టుకునేవాళ్లం. అయినా అమ్మానాన్నలకు మమ్మల్ని బాగా చదివించాలని ఉండేది.ఎంతో అవమానం మేం వాళ్లలా కాకుండా ఉన్నతంగా ఎదగాలని అమ్మానాన్న మమ్మల్ని ప్రయివేట్‌ స్కూల్‌లో చేర్పించారు కానీ… ఫీజులు కట్టలేకపోయారు.

నాలుగో తరగతిలో ఉన్నప్పుడు ఫీజు కట్టలేదని స్కూల్లోంచి గెంటేశారు. ఆ రోజు ఎంత బాధ అనిపించిందో. అమ్మానాన్న కూడా ఎంతో కుమిలిపోయారు. అప్పుడు నేను చిన్నదాన్నే అయినా వాళ్ల బాధ నాకు అర్థమైంది. ఆ క్షణంలోనే అనుకున్నా నా గురించీ, నా చదువు విషయంలో వాళ్లెప్పుడూ బాధపడకూడదని. ఆ రోజు నుంచీ చదువే ప్రపంచం అనుకున్నా. ఇకపై మా చదువు భారం కాకుండా ఉండాలంటే ఏం చేయాలని అందరం ఆలోచించాం. అప్పుడే ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదువుకుంటే చదువూ, వసతి ఉచితమని తెలిసింది. నాన్న నా చేత ఆ పరీక్ష రాయించారు. అలా బోరబండలోని రెసిడెన్షియల్‌ స్కూల్‌లో పదో తరగతి పూర్తిచేశా. అప్పుడప్పుడూ ఇంటికి వెళ్తే ఛార్జీలు పెట్టుకోవాల్సి వస్తుందనీ, కేవలం దసరా, సంక్రాంతి సెలవులకే ఇంటికి వెళ్లేదాన్ని. చివరకు 90 శాతం మార్కులతో పదో తరగతి పాసయ్యానని తెలిపింది.

కార్పొరేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదవాలంటే బోలెడు ఫీజు కట్టాలి. మాకు అంత స్థోమత లేదు. పైగా నాన్న ఇంకా చెల్లినీ, తమ్ముడినీ చూసుకోవాలి. అవన్నీ ఆలోచించి బాగా చదువు చెప్పే కాలేజీలు ఎక్కడుంటాయో తెలుసుకున్నా. అప్పుడే తెలిసింది గౌలిదొడ్డి ప్రభుత్వ కాలేజీ గురించి. కార్పొరేట్‌ కాలేజీలకు దీటుగా అక్కడ బోధన ఉంటుంది. ఆ కళాశాలలో చదువుకున్నవారిలో చాలామంది ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. అక్కడ సీటు రావడమూ కష్టమే. స్క్రీనింగ్‌, మరో రాత పరీక్షలో పాస్‌ కావాలి. నేను అవన్నీ పాసయ్యా. రెండేళ్ల పాటు అక్కడి హాస్టల్‌లో ఉండి చదువుకున్నా. అక్కడికి అందరిలా మా అమ్మానాన్న రావాలంటే వాళ్లు పని వదులుకోవాలి. ఒక్కరోజు పని డబ్బులు కూడా చాలా విలువైనవే. అవన్నీ నాకు తెలుసు కాబట్టి రాకపోయినా బాధపడేదాన్ని కాదు. వాళ్లు ఎలా ఉన్నారో అని మాత్రం బెంగపడేదాన్ని. ఆ ఆలోచనలన్నీ దూరం కావడానికి పుస్తకాలు పట్టుకునేదాన్ని. మా లెక్చరర్‌ ప్రమోద మేడం నాకు అండగా ఉండేవారు. పాకెట్మనీ ఇచ్చేవారు. బయటకు తీసుకెళ్లేవారు. నన్ను గమనిస్తూ.. అమ్మలా చూసుకునేవారు. ఏం చదవాలీ, ఎలా చదవాలి, కెరీర్‌ గురించి గైడెన్స్‌ ఇస్తుండేవారు.

అమెరికా ప్రయాణం: ఇంటర్‌ ఎంఈసీలో 97 శాతం మార్కులొచ్చాయని తెలిపింది.అంతేనా తెలంగాణలో టాప్‌ పదో ర్యాంకు. ఆ రోజు అమ్మానాన్నల సంతోషం అంతా ఇంతా కాదు. నేను వాళ్లకి ఇచ్చిన మొదటి కానుక అదే. ఇక మీదట ఎప్పుడూ వాళ్ల ముఖంలో అలాంటి నవ్వే చూడాలనుకున్నా. అలానే అమ్మావాళ్లకి భారం కాకుండా బుద్వేల్‌లోని సోషల్‌ వెల్ఫేర్‌ కాలేజీలో డిగ్రీ చదివే అవకాశం తెచ్చుకున్నా. డిగ్రీలో మొదటి ఏడాది పూర్తయ్యింది. ఇంతలోనే నాకు కమ్యూనిటీ కాలేజీ ఇనిషీయేటివ్‌ ప్రోగ్రాంలో భాగంగా అమెరికా వెళ్లి చదువుకునే అవకాశం వచ్చింది. అంటే ఏడాదిపాటు చదువుకు దూరమవ్వాలి. అయితే నేను నాలుగో సెమిస్టర్‌ సమయానికి తిరిగి వచ్చి ఒకేసారి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నా. ఇంతకీ నాకు ఈ అవకాశం ఎలా వచ్చిందంటే.. హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ వాళ్లు ఏటా టోఫెల్‌ మాదిరి పరీక్షలు పెడతారు. అందులో ఎంపికైన వారిని అమెరికాలోని కమ్యూనిటీ కాలేజీలో చదువుకోవడానికి పంపుతారని తెలిపింది.

ఈ అవకాశం కోసం వేల మంది పోటీ పడతారు. ఎంపిక ప్రతిభ ఆధారంగానే ఉంటుంది. నేనూ ఆ పరీక్షలన్నీ పాసయ్యా. అక్కడికి వెళ్లాక ఐటీ తరగతులకు హాజరు కావాలి. డెబ్భై గంటలు ఇంటర్న్‌షిప్‌ కూడా చేయాలి. వందగంటలు వలంటరీ సేవలు అందించాలి. మన సంప్రదాయాల్ని అక్కడి విద్యార్థులకు పరిచయం చేసి వాళ్ల గురించీ తెలుసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే… కంప్యూటర్‌ చదువుతోపాటూ, జీవితాన్ని కూడా అధ్యయనం చేసి రావాలి. ఇందుకోసం నేను మసాచూసెట్స్‌లోని బంకర్‌హిల్‌ కమ్యూనిటీ కాలేజీలో చదువుకోబోతున్నా. ఈనెల 29న ప్రయాణం. ఏడాది తరువాత తిరిగొస్తా. మాకు సంబంధించిన ఖర్చులన్నీ అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. ఫీజు కట్టలేదని ప్రయివేట్‌ స్కూల్‌లోంచి బయటకు గెంటినప్పుడు ఎంత బాధపడ్డానో… ఇప్పుడు రెట్టింపు సంతోషంగా చదువుకోవడానికి వెళుతున్నందుకు గర్వంగా ఉందని తెలిపింది ప్రియాంక.

- Advertisement -