రాహుల్‌ని ఒంటరిచేశారు..సీనియర్లపై ప్రియాంక ఫైర్‌.!

330
priyanka vadra

లోక్ సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు తీవ్ర  నిరాశను మిగిల్చాయి. రాహుల్ సారథ్యంలో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీడ్యబ్లూసీ సమావేశం వాడివేడిగా జరిగింది. ఇక కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామాకు సిద్ధపడ్డారు. సీనియర్ నేతలు సహా పలువురు  వారించినా రాహుల్ అలకపాన్పు వీడలేదని తెలుస్తోంది.

ఇక ఈ సమావేశంలో పాల్గొన్న ప్రియాంకా సీనియర్లపై నిప్పులు చెరిగినట్లు సమాచారం. రాహుల్‌ని ఒంటరి చేసి పార్టీ ఓటమికి సీనియర్లంతా కారణమయ్యారని ఆమె మండిపడినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం దగ్గరి నుండి  రాఫెల్,చౌకీ దార్ చోర్  వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా రాహుల్ ఒక్కరే ప్రచారాన్ని చేశారని తెలిపారు.సీనియర్ నేతలంతా రాహుల్ ప్రచారానికి దూరంగా ఉన్నారని ఆమె ఆరోపణలు గుప్పించిన ప్రియాంక కొంతమంది సీనియర్లు తమ కొడుకుల సీటు,వారి నియోజకవర్గాలకే పరిమితమై ప్రచారం చేశారని  దుయ్యబట్టారట. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ సీఎంలు కమల్‌నాథ్, అశోక్‌ గెహ్లోత్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరంల తీరుపై ఆమె నిప్పులు  చెరిగారని సమాచారం.

కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళనలో భాగంగా ఏఐసీసీలో కీలక పదవులున్న నేతలను రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఇక  రాహుల్ స్ధానంలో సారథ్య బాధ్యతలు తీసుకునేందుకు ప్రియాంక ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రాహుల్ తన అలకపాన్పు వీడకపోతే గాంధేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు గడ్డుపరిస్థితులను తీసుకొచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.