బిజెపి పాలనపై మునుగోడు జనం ఆగ్రహం
బిజెపికి అడుగడుగునా చేదు అనుభవాలే
చెప్పుకోవడానికి ఏమీలేకనే ఆరోపణలు
మునుగోడు నుంచే తిరుగుబాటు షురూ
దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పాటు ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల ధరల ప్రభావం భారతీయ జనతా పార్టీ (బి.జె.పి)పై తీవ్రస్థాయిలో పడుతోంది. విద్యావంతులు, మేధావులే కాకుండా సామాస్య ప్రజలు కూడా పెరిగిన ధరలపై బి.జె.పి.పైన ఆగ్రహంతో ఉన్నారు. పెరిగిన ధరల దెబ్బ మునుగోడులో బి.జె.పి.కి అనేక చేదు అనుభవాలను రుచి చూపిస్తోంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో “గ్యాస్ ధరలు పెంచిన బి.జె.పి.నాయకులు మా ఇంటికి రావద్దు, ఓట్లు అడగొద్దు, మమ్ములను ఇబ్బంది పెట్టవద్దు” ఇంటి దర్వాజపైన నోటీసు రాసిపెట్టారంటే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎంతటి ఆగ్రహంతో ఉన్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేగాక మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్లోని ప్రజలు బి.జె.పి. అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, ఆయన అనుచరగణాన్ని కూడా పలు గ్రామాల్లో ప్రజలు ధరలపై నిలదీశారు. జనాన్ని శాంతింపజేయడానికి బి.జే.పి.నేతలకు క్లిష్టంగానే మారిందని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులే అంగీకరిస్తున్నారు. ఒకవైపు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను ఆకాశాన్నంటే విధంగా పెంచడమే కాకుండా మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా అనేక ఇబ్బందులు సృష్టిస్తున్న కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిపైన కూడా మునుగోడులోని విద్యావంతులైన యువకులు చర్చించుకొంటున్నారు. వ్యవసాయ రంగానికి నష్టదాయకమైన నల్లచట్టాలను రద్దు చేయాలని న్యూఢిల్లీలో ఏడాది కాలంపాటు పంజాబ్, హర్యానా, యు.పి. రాష్ట్రాలకు చెందిన రైతులు చేసిన ఉద్యమాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మద్దతు పలకడపమే కాకుండా ఆ చట్టాలను రద్దు చేయాల్సిన అవసరాన్ని రాష్ట్రంలోనూ,జాతీయ మీడియాలో కూడా కూలంకషంగా వివరించడం, పార్లమెంట్ సమావేశాల్లో కూడా కేంద్రంలోని బి.జె.పి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడంతో కేంద్ర సర్కార్ తెలంగాణ రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదనే విషయాలు కూడా చర్చనీయాంశంగా మారాయంటే గ్రామాల్లోని ప్రజలు, విద్యావంతులు, యువకులు ఎంతటి పరిణతి చెందారో అర్ధంచేసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్ళినా కేంద్రంలోని బి.జె.పి.పాలన ఎంతటి దారుణంగా ఉందో కూడా చర్చలు జరుపుతున్నారని, గ్రామాల్లోని రచ్చబండలు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్ళల్లో ఏ ఇద్దరు, ముగ్గురు కలిసినా కేంద్ర ప్రభుత్వ పాలనపైనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దీనికితోడు గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాలుగేళ్ళ సమయంలో ఎన్నడూ మునుగోడు నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామాన్ని సందర్శించలేదని, స్థానిక ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొన్న పాపాన పోలేదని, తీరా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు తలెత్తినప్పుడే ఆయన కనబడుతున్నాడని స్థానికులు పెదవి విరుస్తున్నారు. దీనికితోడు బి.జె.పికి చెందిన అభ్యర్ధిగానీ, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నాయకులు ఎవ్వరు వచ్చినా ముఖ్యమంత్రి కె.సి.ఆర్.ను, టి.ఆర్.ఎస్ ప్రభుత్వాన్ని తిడుతున్నారేగానీ బి.జె.పి.వాళ్ళు ఇప్పటి వరకూ ఏం చేశారు.
గెలిస్తే నియోజకవర్గానికి ఏమేమి చేస్తామో కూడా చెప్పలేకపోతున్నారని,బి.జె.పి.వాళ్ళకు చేసిన మంచి పనులేమీ లేకపోవడం, ధరలు పెచుకొంటూపోయి సామాన్య ప్రజలే కాకుండా మధ్యతరగతి, చివరకు ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు కూడా ప్రశాంతంగా బ్రతకలేని పరిస్థితులను సృష్టించి పెట్టిన పార్టీగా బి.జె.పి.ని మునుగోడు ప్రజలు గుర్తించారని విశ్లేషకులు వివరించారు. మునుగోడు నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి ఫ్లోరోసిస్ సమస్యతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని, కానీ ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ కూడా ఫ్లోరిన్ నుంచి ప్రజలను కాపాడిన పాపానపోలేదని, రాష్ట్ర విభజన తర్వాతనే టి.ఆర్.ఎస్.ప్రభుత్వానికి తమ ప్రాంతంపట్ల చిత్తశుద్ది ఉంది గనుకనే ఆ సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి ఇంటింటికీ రక్షిత మంచి నీటిని నలతో సరఫరా చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు బాగా గుర్తుంచుకున్నారని, అందుకే బి.జె.పి.నేతలు ఎన్ని విధాలుగా తిట్టినా, మరెన్నో విధాలుగా ఆరోపణలు చేసినా మునుగోడు జనం నవ్వుతూ పక్కకు తప్పకొంటున్నారని నియోజకవర్గంలో పర్యటించిన కొందరు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి పరిస్థితులు, నేడున్న పరిస్థితులను ప్రజలు బేరీజు వేసుకొంటున్నారని, కేవలం వేల కోట్ల అక్రమార్జన కోసం బి.జె.పి.పెద్దలు తెచ్చిన ఎన్నికలేనని, ప్రజల కోసంగానీ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం వచ్చిన ఎన్నికలు కాదని కూడా జనం గట్టిగా నమ్ముతున్నారని వివరించారు.
అందుకేనేమో బి.జె.పి.అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట ఆయన సొంత మనుషులు తప్ప నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు ఎవ్వరూ ఉండటం లేదని కూడా తెలిపారు. అంతేగాక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట ఉన్నవారంతా నల్గొండ పట్టణానికి చెందిన ఆయన సొంత మనుషులేని, జిందాబాదు కూడా వారే కొడుతున్నారని, గ్రామాల్లో పర్యటిస్తున్నప్పటికీ స్థానికులు ఎవ్వరూ బి.జె.పి. అభ్యర్థి వెంట రావడంలేదని కూడా తమ పరిశీలనలో తేలిందని వారు వివరించారు. పరిస్థితులు ఏ ఒక్క గ్రామంలోనూ బి.జె.పి.కి అంతగా అనుకూలాంశాలు ఏమీ లేవని, కమలం పార్టీ పెద్దలు ఏదైనా ఎన్నికల అక్రమాలకు పాల్పడితే ఫలితాలు తారుమారు అవుతాయేమోగానీ, ప్రజల్లో మాత్రం బి.జె.పి.పట్ల సానుకూలత లేదని విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు. ఇలా ఉన్న మునుగోడులో రాజకీయ విశ్లేషకుల పరిశీలనాంశాలు నిజమౌతాయా? లేదా? అనేది తేలాలంటే పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలు జరిగే వరకూ వేచి చూడాలి.