“నా ఫ్రెండ్స్ యు.ఎస్. వెళ్లిపోతుంటే నేను చాలా బాధపడుతుంటా. మా గ్రూప్ లో సగం మంది అలా వెళ్లిపోయి, సగం మంది ఇక్కడ మిగిలిపోయాం. ఆ ఇస్యూపై చేసిన మూవీ కాబట్టి ‘ప్రెజర్ కుకర్’ అదిరిపోతుంది” అన్నారు హీరో విశ్వక్ సేన్. సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. ‘ప్రతి ఇంట్ల ఇదే లొల్లి’ అనేది ఉప శీర్షిక. కారంపురి క్రియేషన్స్ , మైక్ మూవీస్ పతాకాలపై సుశీల్ సుభాష్ కారంపురి, అప్పిరెడ్డి (‘జార్జిరెడ్డి’ ఫేమ్) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుజోయ్, సుశీల్ దర్శకులు. అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తోంది. ఫిబ్రవరి 21న సినిమా విడుదలవుతోంది. మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని దసపల్లా హోటల్లో కన్నుల పండుగగా జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో హీరో విశ్వక్ సేన్ బిగ్ సీడీని లాంచ్ చేశారు.
సీనియర్ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. “ప్రధానంగా ఇది సందేశం మేళవించిన ఎంటర్టైనర్. సినిమాపై ప్యాషన్ ఇద్దరు దర్శకుల్లో అణువణువూ కనిపించింది. అమెరికాకు వెళ్లినవాళ్లు నిజంగా సుఖపడటం లేదు, చాలా కష్టపడుతున్నారు. నా పిల్లలు ప్రయోజకులై అమెరికాకు వెళ్లిపోయారు అని పక్కవాళ్లను ద్వేషించే పాత్రను దర్శకులు నాకిచ్చారు. కలలు కన్న దేశానికి వెళ్లాక, కన్నదేశం కల్లోకి వస్తుందని ఒక కవి అద్భుతమైన లైన్ రాశాడు. ‘ప్రెజర్ కుక్కర్’ అనే టైటిల్ నాకే కిక్కునిచ్చింది. కొన్నిసార్లు సినిమాని టైటిల్ ఎలివేట్ చేస్తుంది. ఇలాంటి వండర్ఫుల్ టైటిల్ పెట్టినందుకు డైరెక్టర్లను అభినందిస్తున్నా. నువ్వు అమెరికాకు వెళ్లకపోతే ఎందుకూ పనికిరావని తోమేస్తున్న తల్లిదండ్రులకు ఇదొక మంచి కనువిప్పు” అని చెప్పారు.
నటి సంగీత మాట్లాడుతూ .. “ఇందులో నేను చేసిన క్యారెక్టర్ నా కోసమే పుట్టినట్లు అనిపించిందని డైరెక్టర్ చెప్పారు. షూటింగ్ చేస్తున్నప్పుడు బాపు గారిని గుర్తుకు తెచ్చారు. సహజత్వానికి దగ్గరగా ఈ సినిమా తీశారు. ఇలాంటి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉంటే సినిమా ఇంకా ముందుకు వెళ్తుంది. ఇండస్ట్రీ ఆరోగ్యకరంగా ఉంటుంది. మాలాంటి ఆర్టిస్టులు హ్యాపీగా ఉంటారు. ‘ముత్యాల ముగ్గు’ సంగీతను ఈ సినిమాతో ‘ప్రెజర్ కుక్కర్’ సంగీత అంటారని ఆశిస్తున్నాను” అన్నారు.
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ, “ఈ మూవీలో టైటిల్స్ వచ్చేటప్పుడు నేను కనపడతా. ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అలా కనిపించడం నాకు తెలిసి టాలీవుడ్ లో ఇదే మొదటిసారి. దీనికి ప్రమోషనల్ సాంగ్ చెయ్యడం గర్వంగా చెప్పుకుంటాను. మూవీ జబర్దస్త్ గా ఉంది. క్లీన్ అండ్ నీట్ ఎంటర్టైనర్. సుజోయ్, సుశీల్ తమ హ్యాపీనెస్ కోసం ఈ సినిమా తీశారు. యూత్ వాళ్లూ వీళ్లూ చెప్పింది కాకుండా మన మనసుకు ఏది నచ్చితే అది చెయ్యాలని ఈ సినిమాలో చెప్పారు” అన్నారు.
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ..ఈ సినిమాలో ఉన్న లొల్లి ప్రతి ఇంట్లో ఉండేదే. ఆ సమస్యను తీసుకొని ఈ సినిమా చేశారు. ఈ సినిమా చూశాను, బాగా కనెక్టయ్యాను. ప్రతివాళ్లూ కనెక్టవుతారు. సుజోయ్, సుశీల్ చాలా బాగా సినిమా తీశారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకీ ఈ బజ్ చూడలేదు. వానొచ్చే ముందు వచ్చే మట్టివాసనలా ఈ సినిమాకు పాజిటివిటీ కనిపిస్తోంది. ప్రీతి చాలా బాగా చేసింది” అన్నారు.
నేషనల్ అవార్డ్ వస్తుందని అనుకుంటున్నా!
డైరెక్టర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ..”కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టీజర్ చూశాను. ఈ కాన్సెప్టు నచ్చింది. వెంటనే సినిమా చూడాలనిపించింది. అప్పుడే క్యూట్ టీజర్ అని ట్వీట్ చేశాను కూడా. దీన్ని చూస్తుంటే నా ప్రెజర్ కుక్కర్ జర్నీ గుర్తుకొస్తోంది. సినిమా తియ్యడం ఒకెత్తు అయితే, ఆడియెన్సును థియేటర్ కు రప్పించడమనేది పెద్ద ఫైట్. చూసినవాళ్లు పదిమందికి చెప్తే, మంచి సినిమా బతుకుతుంది. యంగ్ యాక్టర్స్, డైరెక్టర్స్, గుడ్ సినిమాని ఎంకరేజ్ చెయ్యమని కోరుతున్నా” అన్నారు.
డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ .. “దాదాపు మూడు నెల్ల క్రితం ఈ సినిమా చూశాను. నాకు సినిమా నచ్చింది కానీ అక్కడక్కడా చిన్న అసంతృప్తి అనిపించింది. డైరెక్టర్స్కు ఆ విషయమే చెప్పాను. నేను ‘గమ్యం’ తీశాక ఏడు నెలలు ఆగాను. నా కోసం, నాకో కెరీర్ రావాలని ఆ సినిమా తీశాను. ఇంకొక్కసారి చూసుకొని రిలీజ్ చెయ్యమన్నాను. ఎవరైనా ఇలాంటి సలహా ఇస్తే, ఏడ్చావులే అంటారు. చిన్న చిన్న కరెక్షన్స్ చేసి మళ్లీ వారం తర్వాత చూపించారు. బాగుందన్నాను. నెల తర్వాత మళ్లీ చూడమని చెప్పారు. చాలా బాగుందన్నాను. మూడు నాలుగు వారాల క్రితం మొత్తం సినిమా చూశాను. సుజోయ్, సుశీల్ ఒక అద్భుతమైన సినిమా తీశారు. నేను ఈ సినిమాని ఒకటికి నాలుగు సార్లు చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. పన్నేండేళ్ల క్రితం ఇండస్ట్రీలోని చాలామంది తలో ఒక చెయ్యివేసి హెల్ప్ చేస్తేనే నేను రాగలిగాను. అప్పుడు నేనున్న ప్రెజర్ కుక్కర్ పరిస్థితిని వీళ్లలో చూసుకున్నాను. వీళ్లు చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ మేకర్స్. అద్భుతమైన కేస్టింగ్ తీసుకున్నారు. రోనక్, ప్రీతి ఫెంటాస్టిగ్గా చేశారు. డైరెక్టర్స్ ఒక కథను నమ్మి, చెప్పాలనుకున్న దాన్ని చాలా అందంగా చెప్పారు. అద్భుతమైన మ్యూజిక్ ఉంది. ఈ సినిమాకు అద్భుతమైన విజయం వచ్చి ఈ డైరెక్టర్లు మరిన్ని మంచి సినిమాలు తియ్యాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.
నిర్మాతల్లో ఒకరైన అప్పిరెడ్డి మాట్లాడుతూ.., “సుజోయ్, సుశీల్ కలిసి ఎంతో కష్టపడి ఈ మూవీ స్క్రిప్ట్ రాసి, డైరెక్ట్ చేశారు. ‘జార్జిరెడ్డి’ తర్వాత రిలీజవుతున్న నా సినిమా ఇది. మా నాన్న ఒక రైతు. నేను మైక్ మూవీస్ మొదలుపెట్టి ‘సినిమా తీస్తున్నా, డబ్బులు కావాలి’ అని అడిగినప్పుడు, నామీద నమ్మకంతో ఏమీ అనకుండా అమ్మానాన్నలిద్దరూ ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమా నిర్మిస్తున్నామంటే 95 శాతం మంది నెగటివ్ గా చెప్పేవాళ్లే. ఎందుకంటే డబ్బులు పోతాయనే ఉద్దేశంతో. ఇలాంటి పరిస్థితుల్లో నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీకి ధన్యవాదాలు. వాళ్లు సపోర్ట్ చెయ్యకపోతే నేను ఇక్కడ ఉండేవాడ్ని కాను. నేను కూడా యూఎస్ నుంచి వచ్చినవాడినే. డైరెక్టర్స్ కూడా అక్కడినుంచి తిరిగొచ్చినవాళ్లే. ఈ సినిమా ఒక మంచి ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. యూత్ కు ఒక మోటివేషన్ మూవీలా ఉంటుంది. ప్రతి సన్నివేశం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. డైరెక్టర్స్ వల్లే ‘ప్రెజర్ కుక్కర్’ తియ్యడం సాధ్యపడింది. దీన్ని రిలీజ్ చేస్తున్న అభిషేక్ పిక్చర్స్ వాళ్లకు ధన్యవాదాలు” అని చెప్పారు.
డైరెక్టర్స్ సుజోయ్, సుశీల్ మాట్లాడుతూ.. “రామేశ్వర్ చాలా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. మాతో ఎలాంటి బంధం లేకపోయినా డైరెక్టర్ క్రిష్ మా మూవీ చూసి నచ్చి, మాకు హెల్ప్ చెయ్యాలని భావించారు. ‘నేను మీకు ఎలా హెల్ప్ చేస్తున్నానో, రేపు మీరు కూడా వేరేవాళ్లకు హెల్ప్ చెయ్యాల’ని చెప్పారు. దాన్ని మా మైండులో పెట్టుకుంటాం. ఈ మూవీ ప్రారంభ దశ నుంచి మధుర శ్రీధర్ మాకెంతో సహాయపడ్డారు. తరుణ్ భాస్కర్ హెల్ప్ చేశారు. ఈ సినిమా బాగా రావడానికి సహకరించిన నటీనటులకు, టెక్నీషియన్లు అందరికీ థాంక్స్. ఫిబ్రవరి 21న మూవీ రిలీజవుతోంది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం” అన్నారు.
ఈ మూవీ అదిరిపోతుంది!
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “ఈ సినిమాకి మొదట ‘ఎ ఫర్ అమెరికా’ అనే టైటిల్ పెట్టారు. అప్పట్నుంచీ ఈ సినిమా గురించి నాకు తెలుసు. కొత్తోళ్లు ఒక సినిమా తీసి రిలీజ్ చేస్తున్నారు. అది నాకు మనసులో సంతోషాన్నిస్తుంది. నేను రూ. 12 లక్షలు పెట్టి ‘వెళ్లిపోమాకే’ అనే సినిమా తీసినా. దాన్ని మేం థియేటర్ల కోసం తియ్యలేదు కానీ దిల్ రాజు గారు దాన్ని తీసుకొని రిలీజ్ చేశారు. ఆ రోజు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో, కొత్తోళ్లు సినిమా తీసి రిలీజ్ అవుతోందంటే హ్యాపీ అనిపిస్తుంది, అది నా సినిమానే అని అనిపిస్తుంటుంది. ఈ సినిమా చాలా బాగుంటుంది. నా ఫ్రెండ్స్ యు.ఎస్. వెళ్లిపోతుంటే నేను చాలా బాధపడుతుంటా. మా గ్రూప్ లో సగం మంది అలా వెళ్లిపోయి, సగం మంది ఇక్కడ మిగిలిపోయాం. ఆ ఇస్యూపై చేసిన మూవీ కాబట్టి ‘ప్రెసర్ కుకర్’ అదిరిపోతుంది రోనక్ అందంగా ఉంటాడు. యాక్టింగ్ అదరగొడతాడు. డాన్సులేస్తాడు. హీరోగా తను బాగా ఎదుగుతాడు. ప్రీతి అప్పుడే హీరోయిన్ అయిపోయింది. రోనక్, ఆమె జంట చాలా బాగుంది. రాహుల్ సిప్లిగంజ్ రెండు పాటలూ అదరగొట్టాడు” అని చెప్పారు.
వాళ్ల ముఖాలే నాకు ఇన్ స్పిరేషన్!
హీరో సాయిరోనక్ మాట్లాడుతూ, “ఇందులో కిశోర్ అనే పాత్రను చెయ్యడానికి ప్రేరణ నా చుట్టూ ఉన్నవాళ్లే. ఇంజినీరింగ్ చేసి, యూఎస్ కు వెళ్లడానికి వీసా రిజెక్ట్ అయ్యిందని ఇంట్లో నుంచి బయటకు వెళ్లని వాళ్లను చూశాను. డిగ్రీ అయిపోయాక జాబ్ రావట్లేదని ఫంక్షన్లకు అటెండ్ కాని వాళ్లను చూశాను. ఫ్రెండ్స్ అందరూ యూఎస్ వెళ్లిపోతున్నారు, నాకూ వేరే ఆప్షన్ లేదని యూఎస్ వెళ్లినవాళ్లను చూశాను. ఇక్కడ పనిచేస్తే ఏమొస్తుంది, అక్కడ కేఎఫ్సీలో పనిచేసినా ఎక్కువ డబ్బులు వస్తాయని వెళ్లినవాళ్లను చూశాను. వీళ్లందరి ముఖాలే నాకు ఇన్స్పిరేషన్. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇందులో క్యారెక్టర్ చేశాను. ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా రిలీజయ్యాక కచ్చితంగా హిట్టవుతుంది” అని చెప్పారు.