చీప్ ఎలక్షన్ కమిషనర్ నసీం జైదీ రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేశారు. దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు చర్యలు చేపట్టినట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నసీమ్ జైదీ తెలిపారు. నామినేషన్ల దాఖలుకు జూన్ 28 చివరి తేదీ అని వెల్లడించారు.
ఒకవేళ ఎన్నిక అవసరమైతే జులై 17న నిర్వహిస్తామని, జులై 20 కౌంటింగ్ ఉంటుందని తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగుస్తుందని, ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఆయన మీడియాకు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికకు ఈనెల 14న నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు స్పష్టంచేశారు.
అంతేకాకుండా చీఫ్ ఎన్నికల కమిషనర్ నసీం జైదీ మీడియా సమావేశంలో వెల్లడించిన మరిన్ని విషయాలు..
* రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల శాసన సభ్యులు పాల్గొంటారు.
* రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం జులై 24తో ముగుస్తుంది.
* పార్లమెంట్ సభ్యులు న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ఏర్పాటుచేసిన కేంద్రంలో ఓటు వేస్తారు. ఇక ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల రాజధానుల్లో తమ ఓటును వినియోగించుకుంటారు.
* ఎలాంటి పరిస్థితుల కారణం చేతనైనా ఎమ్మెల్యేలు పార్లమెంటులో ఓటు వేయాలనుకుంటే 10 రోజుల ముందే ఈసీకి నోటీసు ఇవ్వాలి.
* రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాజకీయ పార్టీలు కానీ, నేతలు కానీ ఎలాంటి బహుమతులు ఇవ్వకూడదు.
* రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్‌ను ఈసీ జూన్ 14న విడుదల చేస్తుంది.
* నామినేషన్లకు ఆఖరి తేదీ జూన్ 28.
* నామినేషన్లను వెనక్కి తీసుకోవడానికి ఆఖరి తేదీ జులై 1
* పోలింగ్ జులై 17న జరుగుతుంది.
* ఓట్ల లెక్కింపును జులై 20న న్యూఢిల్లీలో ఉంటుందని తెలిపారు.