రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు సాయంత్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా దుర్గగుడిలో దర్శన వేళల్లో కీలక మార్పులు చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు సాయంత్రం 7:10 గంటలకు దుర్గగుడికి చేరుకోనున్నారు. అనంతరం 7:20 గంటల నుంచి 7:40 గంటల వరకు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయ అర్చకులు ఆమెకు ఆశీర్వచనం అందించనున్నారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భద్రతా పరమైన ఆంక్షలు అమలు చేయనున్నారు. నేడు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి కొండపైకి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు.
అలాగే మధ్యాహ్నం నుంచి ప్రోటోకాల్ దర్శనాలను నిలిపివేయడంతో పాటు, రాత్రి 7:45 గంటలకు కేటాయించిన ప్రోటోకాల్ దర్శన స్లాట్ను కూడా రద్దు చేశారు. రాష్ట్రపతి పర్యటన పూర్తయ్యే వరకు భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఈ మార్పులు అమల్లో ఉండనున్నాయి.
Also Read:ది ట్రైటర్స్ తెలుగు..క్లోక్మెన్ సందడి
దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి, ఆలయ అధికారులు, పోలీసుల సూచనలకు సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.

