మాజీ సీఎం,సినీ నటుడు ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలైంది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము రిలీజ్ చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీర్ ఎంతో ప్రత్యేకమన్నారు. కృష్ణుడు, రాముడి వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతమని, ప్రజల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. రాజకీయాల్లోనూ సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నటుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌తో పనిచేసిన సన్నిహతులు హాజరయ్యారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో తయారైన ఈ స్మారక నాణెం.. 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలిపి ఉంటుంది. ఓ వైపు ఎన్టీఆర్ బొమ్మ ఉంటే మరోవైపు మూడు సింహాల బొమ్మ ఉంటుంది.