భారత రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. దేశ ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా… 30న నామినేషన్ల పరిశీలన జరగనుంది. జులై 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన వెంటనే బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు? ఎందరు అనే విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. రాష్ట్రపతి ఎన్నికకు ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో ఉన్న పక్షంలో జులై 18న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక ఓట్ల లెక్కింపును జులై 21న చేపడతారు. అదే రోజు విజేతను ప్రకటిస్తారు.
ఇక ఈ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. పార్లమెంటు హౌస్, రాష్ట్రాల శాసన సభల్లో రహస్య బ్యాలట్ విధానంలో పోలింగ్ జరుగుతుంది. ఇక,లోక్‌సభ, రాజ్యసభ, శాసన సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతి ఎన్నికవుతారు. ఢిల్లీ, పుదుచ్చేరి శాసన సభల సభ్యులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.