ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తిరిగి రాజకీయాల్లోకి రానున్నారా…? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాహుల్ గాంధీతో భేటీ అయిన అనంతరం ప్రశాంత్ కిశోర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరుగనున్న వివిధ రాష్ట్రాల ఎన్నికలు, 2024 సాధారణ ఎన్నికల గురించి ప్రశాంత్ కిశోర్, గాంధీలతో చర్చించినట్లు భావించినా.. అంతకంటే పెద్దదే ఏదో జరగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పడం గమనార్హం.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పనిచేసిన పీకే.. ఆ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత తాను ఇక వ్యూహకర్త పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. తర్వాత వెంటనే శరద్ పవార్‌తో పలుమార్లు భేటీ అయిన పీకే…రాహుల్‌తో భేటీ అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో జేడీయూలో చేరిన ప్రశాంత్ కిశోర్…తర్వాత వచ్చిన విభేదాల కారణంగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు వస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.