ప్రపంచ తెలుగు మహాసభలు దేదీప్యమానంగా వెలుగొందాయి. తెలంగాణ భాష, సాహిత్యం, జానపద కళల వైభవాన్ని ఎలుగెత్తి చాటాయి. ‘తెలుగు వెలుగులు ప్రపంచానికి పంచుదాం.. తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటుదాం’ అనే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను వైభవంగా నిర్వహించింది.
డిసెంబర్ 15 నుంచి 19 వరకు సాగిన ఐదు రోజుల సంబరం ఐదు క్షణాల్లో ముగిసిందన్న రీతిలో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ముగిశాయి. ఆనంద క్షణాలు వెంట తీసుకుని ఆహుతులు తమ గమ్యానికి బయలుదేరారు. అంగరంగ వైభవంగా మొదలైన ఈ సభలు..ఎక్కడా ఎలాంటి అపశృతి లేకుండా ముగిసిన తీరు తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను అంబరాన్ని అంటేలా చేసింది.
ఆరంభంలోనూ, ముగింపులోనూ తారాజువ్వల సవ్వడి మిరుమిట్లు గొలిపి దీపావళి దివ్వెలను వెలగించాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చి ప్రజలకు శుభాభినందనలు అందచేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభారంభాన్ని ఇవ్వగా సిఎం కెసిఆర్ కనుసన్నల్లో ఆద్యంతం ఈ ఉత్సవాలు దసరా సంబరాలను గుర్తుకు తెచ్చేలా చేశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపుతో అంతా భారంగా వేదికను వీడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాహితీ గోష్టులు, అవధానాలు,చర్చలు ఆద్యంతం ఆసక్తిని కలిపించాయి. తెలుగు తేజాన్ని మరింత పటిష్ట పరిచేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణ విశిష్టతను తెలిపే లఘు చిత్రాన్ని ప్రదర్శించేలా చొరవ చూపారు.
ముగింపు వేడుకలను వీక్షించేందుకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి భాషాభిమానులు భారీ స్థాయిలో తరలివచ్చారు. తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ సాహిత్య అకాడవిూ ఛైర్మన్ నందిని సిధారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు.
ఐదు రోజుల పాటు ఎల్బీ స్టేడియం, రవీంద్రభారతి సహా వివిధ వేదికల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, అవధానాలు, సాహితీ సదస్సులు, చర్చాగోష్ఠిలు ఆకట్టుకున్నాయి. ముగింపు వేడుకల్లో భాగంగా ప్రధాన వేదికపై పేరిణి నృత్యం, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే లఘుచిత్రం ప్రదర్శించారు. దేశ విదేశాలతో పాటు రాష్ట్ర నలుమూల నుంచి తెలుగు భాషాభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది.
ఈ మహాసభలకు 42 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయిన ఈ మహాసభల్లో తెలుగు పాట మారుమోగింది. టాలీవుడ్ తారలు నటించిన ఓ పాట.. తెలంగాణ గొప్పతనాన్ని వర్ణిస్తూ సాగుతోంది. తెలుగు భాషా కవులు, రచయితలు, శాసనాల గురించి వివరిస్తూ ఆ పాట సాగిన వైనం అద్భుతం. ఇక సినీ ప్రహుఖులు సైతం తెలుగు భాష కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి ముగ్దులయ్యారు. శ్రీకృష్ణదేవరాయ , మళ్ళీ కేసీఆర్ లో కనిపిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
ఇక ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని పాటలను చిత్రీకరించింది. బతుకమ్మ, తెలుగుభాష ఔన్నత్యానికి కృషి చేసిన కవులు, రచయితపై రూపొందించిన పాటలు అలరించాయి. తెలుగును కాపాడుకోవాలన్న మహాసభల నుంచి వచ్చిన వినతి మేరకు ఇక నుంచి ప్రతియేటా డిసెంబర్‌లో తెలంగాణ తెలుగు మహాసభలనునిర్వహిస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు.
అలాగే తెలుగు అబ్యున్నతికి వచ్చిన వినతులను పరిశీలించి జనవరిలో సాహితీవేత్తలతో సమావేశమవుతామని, అప్పుడే కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవంగా తెలుగు మహాసభలు నిర్వహించుకొని ప్రపంచానికి చాటిచెప్పేలా కేసీఆర్ కృషిచేశారు. అంతేకాకుండా ఇక నుంచి ప్రతీ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రెండు రోజుల పాటు వైభవంగా తెలంగాణ తెలుగు మహాసభలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు.