ముస్లింల అతిపెద్ద పండగ రంజాన్. పండుగ దగ్గరకు వస్తుండటంతో మసీదులు ఇఫ్తార్ విందులతో మెరిసిపోతున్నాయి. పలువురు రాజకీయ నేతల రాకతో మసీదులు కళకళలాడుతున్నాయి. ఈసందర్భంగా ఈనెల 13న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇఫ్తార్ విందు ఇవ్వనున్నాడు. ఈ ఇఫ్తార్ విందుకు కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖులు హాజరవ్వగా పలు రాష్ట్రాలనుంచి కాంగ్రెస్ కు మద్దతు పలికిన పార్టీల నేతలు కూడా హాజరవుతారు. హై ప్రోఫైల్ నేతలు చాలా మంది ఈ ఇఫ్తార్ విందుకు హాజరుకానున్నారు.
ఇక రాహుల్ గాంధీ ఇచ్చే విందులో హాజరయ్యే కొంత మంది ప్రముఖుల లిస్ట్ బయటకు వచ్చింది. ఈలిస్ట్ లో కొంతమంది ప్రముఖులకు ఆహ్వానం అందలేదని సమాచారం. అందులో ప్రముఖంగా కొంత మంది సీనియర్లు పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈ ఇఫ్తార్ విందుకు ఆహ్వానం అందలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆహ్వానం పంపకపోవడానికి బలమైన కారణమే ఉందని చెప్పుకోవాలి. మొన్న నాగ్ పూర్ లో జరిగిన ఆర్ఎస్ ఎస్ కార్యక్రామానికి ప్రణబ్ ముఖ్య అతిధిగా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ కార్యక్రమానికి వెళ్లవెద్దని చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ప్రణబ్ కు సూచించారు. అయినా ప్రణబ్ వారి మాటలు పట్టించుకోకుండా వెళ్లారు. దేశంలో తమకు ప్రత్యర్ధిగా ఉన్న బిజెపి అనుబంధ ఆర్ ఎస్ ఎస్ కు ఎలా హాజరవుతారని కాంగ్రెస్ నేతలు ప్రణబ్ పై మండిపడ్డారు. త్వరలో రాహుల్ ఇచ్చే విందుకు ఎంతమంది ప్రముఖులకు ఆహ్వానం అందుతుందో చూడాలి.