దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్ధానాలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజైన సంగతి తెలిసిందే. రాష్ట్రం నుండి రెండు రాజ్యసభ స్ధానాలు ఖాళీగా ఉండగా డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు పదవీ కాలం ముగియనుంది. రెండు స్థానాలు టీఆర్ఎస్‌కే దక్కే అవకాశం ఉండగా ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఇక ఇప్పటికే ఓ స్థానానికి నోటిఫికేషన్ విడుదల కాగా మొత్తంగా 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ప్రముఖంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి మోత్కుపల్లి నర్సింహులు, ఎస్టీ నుంచి సీతారాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. బీసీల నుంచి నారదాసు లక్ష్మణరావు, పీఎల్ శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రాజ్యసభ రేసులో పారిశ్రామికవేత్తలు దామోదర్ రావు, సీఎల్ రాజం, హెటిరో సీఎండీ పార్థసారథి రెడ్డిల పేర్లు కూడా వినపడుతున్నాయి. దీంతో పాటు సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి పేర్లు వినిపిస్తుండగా సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పేరు సైతం ప్రచారంలో ఉంది. రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు.
జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ప్రకాశ్ రాజ్ పేరుని.. కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయో అని పార్టీ క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.