జాతీయ రాజకీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు మార్మోగిపోతుంది. ఖబడ్దార్ మోదీ.. ఢిల్లీ గోడలు బద్ధలు కొడతా…అవసరమైతే జాతీయ పార్టీ పెడతా అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన సింహగర్జనకు యావత్ దేశం ఫిదా అయింది. మోదీ, బీజేపీపై పోరాటంలో సీఎం కేసీఆర్ చూపిన తెగువ, ధైర్యసాహసాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఇన్నాళ్లకు మోదీని సవాలు చేసిన నాయకుడు కేసీఆర్ రూపంలో దొరికాడని జాతీయ మీడియా సైతం చెబుతోంది. కేంద్రంలోని బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మురం చేశారు.
ఈ మేరకు ముంబై వెళ్లిన సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో పాటు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. మోదీపై పోరాటాన్ని ప్రశంసించిన ఇరువురు నేతలు కేసీఆర్ లాంటి నాయకులు దేశానికి అవసరమని , బీజేపీకి వ్యతిరేక పోరులో తాము సైతం కలిసి పోరాడుతామని ప్రకటించారు. అయితే సీఎం కేసీఆర్ ముంబై పర్యటనలో ఊహించని వ్యక్తి సడన్‌గా ప్రత్యక్షమయ్యారు. ఉద్ధవ్ థాక్రే, శరద్‌పవార్‌తో భేటీ అయిన కేసీఆర్ టీమ్‌లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించడం జాతీయ స్థాయిలో హాట్‌టాపిక్‌గా మారింది. కొంత కాలం క్రితం మాజీ ప్రధాని దేవెగౌడతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ భేటీకి , ప్రకాష్‌రాజ్‌ను కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు మళ్లీ ముంబై పర్యటనలో ప్రకాష్‌రాజ్‌కు చోటు కల్పించారు.
ఇక, ఉద్దవ్ థాక్రేతో భేటీ పూర్తయిన తరువాత కేసీఆర్ తన కారులోనే ప్రకాశ్ రాజ్ తో కలిసి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దగ్గరకు వెళ్లారు. కాగా కేంద్రం పైన పోరాటంలో సీఎం కేసీఆర్ ప్రకాశ్ రాజ్ కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది.. జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్య జరిగినప్పటి నుంచి ప్రధాని మోదీపై, బీజేపీ నేతలపై నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు సంధిస్తున్నారు. సెక్యులర్ భావాలు కలిగిన ప్రకాష్‌రాజ్ బీజేపీ హిందూత్వ రాజకీయాలను, మోదీ నిరంకుశ వైఖరిని గట్టిగా ఎండగడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పాలనపై ప్రకాష్ రాజ్ పలుమార్లు ప్రశంసలు కురిపించారు.
దక్షిణాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాజకీయ నేతలతో ప్రకాష్‌రాజ్‌కు మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ నిర్మాణంలో సీఎం కేసీఆర్ ప్రకాష్‌రాజ్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. అందులో భాగంగా.. ప్రకాశ్ రాజ్ కు టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఇక కేసీఆర్, స్టాలిన్ భేటీ వెనుక ప్రకాష్‌రాజ్ కీలకం కానున్నారని తెలుస్తోంది. స్టాలిన్‌తో ప్రకాష్‌రాజ్‌కు మంచి సంబంధాలున్నాయి. ఏదేమైనా కేసీఆర్ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న కూటమిలో ప్రకాష్‌రాజ్ కీలక పాత్ర పోషించడం ఖాయమని తెలుస్తోంది. మొత్తంగా సీఎం కేసీఆర్ ముంబై పర్యటనలో ప్రకాశ్ రాజ్‌కు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం సినీ, రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.