సీసీసీకి విరాళాల వెల్లువ

355
prabhas

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పాటిస్తున్న లాక్ డౌన్ వలన షూటింగ్‌లు లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘క‌రోనా క్రైసిస్ చారిటీ’ (సి సి సి) కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రూ. 50 ల‌క్ష‌ల రూపాయల విరాళం ప్ర‌క‌టించారు. ప్రభాస్ ఇది వరకే కరోనా నిర్మూలన చర్యల కోసం పి ఎమ్ రిలీఫ్ ఫండ్ కి 3 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలకు 1 కోటి రూపాయలు ( 50 లక్షల రూపాయలు ఆంధ్ర ప్రదేశ్ సీ ఎమ్ సహాయ నిధికి, 50 లక్షల రూపాయలు తెలంగాణ సీ ఎమ్ సహాయ నిధికి) సహాయం అందించారు. ఈ రోజు ప్రకటించిన 50 లక్షల రూపాయల తో ప్రభాస్ కరోనా పై పోరాటానికి 4 కోట్ల 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

షూటింగ్‌లు నిలిచిపోవ‌డం వ‌ల్ల ఆదాయం లేక ఇక్క‌ట్లు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను ఆదుకోవ‌డానికి ఏర్పాటు చేసిన ‘క‌రోనా క్రైసిస్ చారిటీ’కి హీరో సుశాంత్ రూ. 2 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు.

కరోనా మహమ్మారిపై యుద్ధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని హీరో నారా రోహిత్ పిలుపునిచ్చారు. ఆ పోరాటంలో త‌న వంతుగా రూ. 30 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధుల‌కు చెరో రూ.10 లక్షలు, ప్రధాన మంత్రి సహాయ నిధికి మరో రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్న‌ట్లు తెలిపారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌ల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ను అంద‌రూ త‌ప్ప‌కుండా పాటించాలని ప్ర‌జ‌ల‌ను ఆయ‌న కోరారు. మనం పాటించే స్వీయ నియంత్రణే మనకు శ్రీ రామరక్ష అన్నారు. అందరం సమష్టిగా పోరాడి కరోనా మహమ్మారిని తరిమి కొడదాం అని పిలుపునిచ్చారు.

పేద సినీ క‌ళాకారులు, కార్మికుల‌ను ఆదుకోవ‌డంలో యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ భాగ‌స్వాముల‌య్యారు. ప్రస్తుతం న‌డుస్తున్న సంక్షోభ కాలంలో సినిమా షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సినీ కార్మికుల‌కు చేయూత నిచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ఛైర్మ‌న్‌గా ఏర్పాటైన క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి సందీప్ కిష‌న్ రూ. 3 ల‌క్ష‌లు విరాళంగా ప్ర‌క‌టించారు. దీంతో పాటు ‘వివాహ భోజ‌నంబు’ రెస్టారెంట్ల‌లో ప‌నిచేస్తున్న 500కు పైగా ఉద్యోగుల బాగోగుల‌ను సైతం ఆయ‌న చూసుకుంటున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప్ర‌స్తుతం కీల‌క ద‌శ‌లో ఉంద‌నీ, దీన్ని స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌ల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ను అంద‌రూ గౌర‌వించాల‌నీ, వైద్యులు, పోలీసుల సూచ‌న‌ల‌ను పాటిస్తూ, అంద‌రూ త‌మ ఇళ్ల‌కే ప‌రిమిత‌మై ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌నీ సందీప్ కిష‌న్ కోరారు.

సీసీసీకి షైన్ స్క్రీన్స్‌ బ్యాన‌ర్ అధినేత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది రూ. 5 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. దిన‌స‌రి వేత‌నం మీద ఆధార‌ప‌డి బ‌తికే పేద క‌ళాకారులు, సినీ కార్మికుల‌ను ఆదుకోవాల‌నే పెద్ద మ‌న‌సుతో ఏర్పాటైన సీసీసీకి త‌మ వంతుగా ఈ చిన్న ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామ‌ని వారు తెలిపారు. అదే స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ ఈ సంక్షోభ స‌మ‌యంలో ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌నీ, లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రిస్తూ త‌మ త‌మ ఇళ్లల్లోనే సుర‌క్షితంగా ఉండాల‌ని వారు కోరారు.