పీఎస్2 బయట కష్టమేనా!

37
- Advertisement -

బాహుబలి రేంజ్ లో కోలీవుడ్ గట్టి ఆశలు పెట్టుకున్న పొన్నియిన్ సెల్వన్ 1 తమిళనాడు తప్ప బయట ఆశించిన స్థాయిలో ఆడకపోవడం ఇప్పుడు రెండో భాగం బిజినెస్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోందట. ఫస్ట్ పార్ట్ ని తెలుగు రాష్ట్రాలకు నిర్మాత దిల్ రాజు పది కోట్లకు థియేట్రికల్ డీల్ చేశారు. బ్రేక్ ఈవెన్ కే అతి కష్టం మీద చేరుకుంది కానీ ఫైనల్ గా అది లాభమో నష్టమో చెప్పలేనంతగా సోసోగా బయటపడింది. ఇక్కడే నయం. హిందీ, కన్నడ వెర్షన్లు నిర్మొహమాటంగా తిరస్కారానికి గురయ్యాయి. మలయాళం కొంత నయం. అందుకే పీఎస్ 2ని మార్కెటింగ్ చేయడం సవాల్ గా మారింది.

ప్రస్తుతానికి డబ్బింగ్ వెర్షన్లకు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో మణిరత్నం బృందం టెన్షన్ లో ఉన్నట్టు చెన్నై టాక్. ఇంకో నలభై రోజుల్లో విడుదల చేయాలి. ప్రమోషన్లు పూర్తి స్థాయిలో మొదలుపెట్టాలంటే ఆర్టిస్టుల డేట్లన్నీ తీసుకుని కనీసం రెండు వారాలకు పైగా దేశమంతా తిరిగితేనే బజ్ పెరిగేందుకు ఛాన్స్ ఉంటుంది. అరవంలో ఇబ్బంది లేదు. గంపగుత్తగా స్క్రీన్లన్నీ దీనికే ఇస్తారు. కానీ మిగిలిన చోట్ల ఆ పరిస్థితి లేదు. పైగా అఖిల్ ఏజెంట్ అదే ఏప్రిల్ 28న రానుంది. అందులో మమ్ముట్టి ఉండటం కేరళ మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది.

ఇవన్నీ పీఎస్ 2 చుట్టూ ఉన్న చిక్కులే. వీటికి దాటాలంటే పబ్లిసిటీ వేగం పెంచాలి. అసలు మొదటి భాగమే సరిగా అర్థం కానీ ఆడియన్స్ బోలెడున్నారు. పైగా టైటిల్ రోల్ జయం రవిది కావడంతో సీక్వెల్ లో తనకే ఎక్కువ ప్రాధాన్యం ఉండొచ్చు. అదే జరిగితే అప్పుడు ఇతర వెర్షన్లకు టాక్ పరంగా ఇబ్బందవుతుంది. బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, ప్రకాష్ రాజ్, జయం రవి తదితరులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి స్టేట్లన్నీ కవర్ చేసేందుకు లైకా సంస్థ ప్రణాళికను సిద్ధం చేస్తోందట. ఇప్పటిలాగా బజ్ చప్పగా ఉంటే మాత్రం ఓపెనింగ్స్ కష్టమే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -