బండిపై మాజీ ఎంపీ పొన్నం ఫైర్

85
ponnam
- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది..ఆ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ డిపాజిట్ పోగొట్టుకుని చిత్తుగా ఓడిపోయాడు. గత ఎన్నికల్లో 60 వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి డిపాజిట్ కోల్పోయిందంటే దానికి కారణం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే అని కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు. రేవంత్ , ఈటల ఆడిన ఆటలో బల్మూరి వెంకట్ బలిపశువు అయ్యాడని ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హుజురాబాద్‌లో తమ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని బరాబర్ ఊహించామని అన్నారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ధృతరాష్ట్ర ప్రేమతో ఆయన తమ్ముడు పాడి కౌశిక్ రెడ్డిపట్ల వ్యవహరించిన తీరు అక్కడ పార్టీకి నష్టం చేకూర్చిందని పొన్నం ఆరోపించారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లోకి వెళ్లినా అక్కడ బలమైన నాయకత్వం ఉండేలా చూసుకోలేకపోయారని విమర్శించారు. హుజురాబాద్‌లో గెలుపు ఈటల రాజేందర్ వ్యక్తిగతమని, బీజేపీ విజయం కాదని చురకలు అంటించారు. గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది కేవలం 1700 ఓట్లే అదీ నోటా కంటే తక్కువ వచ్చాయన్న సంగతిని గుర్తుంచుకోవాలని పొన్నం బండి సంజయ్‌ను ఎద్దేవా చేశారు. బండి సంజయ్ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచినప్పటికీ హుజురాబాద్‌లో మూడవ స్థానంలో నిలిచాడని, అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న తనకు కేవలం హుజురాబాద్‌ నియోజకవర్గంలోనే 46 వేల ఓట్లు వచ్చాయని పొన్నం బండి గాలి తీశారు.

హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్నా.. కేసీఆర్ ప్రభుత్వం వర్సెస్ ఈటల రాజేందర్‌ సానుభూతికి మధ్య జరిగిన పోరులో డిపాజిట్ గల్లంతు అయిందని పొన్నం అన్నారు..ఇది ఈటల వ్యక్తిగత గెలుపు తప్పా..బీజేపీ పొడిచింది అనుకుంటే అంతకంటే..దౌర్భాగ్యమైన పరిస్థితి లేదని వ్యంగాస్త్రాలు సంధించారు. తప్పకుండా హుజురాబాద్‌లో ఘోర పరాజయంపై పీసీసీ నాయకత్వం సమీక్షించుకోవాలి…ఊరకనే దండోరా సభలు, జంగ్‌సైరన్‌లు వంటి సభల ద్వారా కాంగ్రెస్‌ పార్టీ బలపడుతుందని మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డిలు భావిస్తే…అంతకంటే అజ్ఞానం ఉండదని కౌంటర్ ఇచ్చారు. జిల్లాల వారీగా విబేధాలను పరిష్కరించి , నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం ఉండేలా చర్చలు చేపట్టాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హితవు పలికారు. మొత్తంగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.

- Advertisement -