ఎర్రబెల్లికి ఊహించని ట్విస్ట్…!

72
errabelli
- Advertisement -

ఆర్. నారాయణ మూర్తి దర్శకత్వంలో వచ్చిన రైతన్న మూవీ చూసేందుకు వెళ్లిన తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు‌కు ఊహించని పరిణామం ఎదురైంది. సిన్మా స్టార్ట్ అవుతున్న టైమ్‌లోనే సీఎం కేసీఆర్ నుంచి వెంటనే హైదరాబాద్‌కు రమ్మని ఫోన్ రావడంతో ఎర్రబెల్లి సిన్మా చూడకుండానే బయలుదేరిపోయారు. ఈ ఆసక్తికర ఘటన హన్మకొండలో జరిగింది. తాజాగా దర్శక నిర్మాత, నటుడు నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ” రైతన్న” చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. 2021లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన కథాంశంతో ఈ “రైతన్న” సినిమాను తీసారు.. రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదని అన్నం పెట్టే అన్నదాతకి గిట్టుబాటు ధర కావాలని, కేంద్రప్రభుత్వం డా.స్వామినాథన్ కమిటీ సిఫార్సులని అమలు చేయాలనీ, రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఇలా రైతన్నల ప్రధాన సమస్యలను సినిమాలో చూపించారు.

రైతన్న మూవీ విడుదల సందర్భంగా ఆర్. నారాయణ మూర్తి పలువురు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి రైతుల సమస్యలపై తీసిన తన చిత్రాన్ని ప్రమోట్ చేయాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆర్.నారాయణమూర్తితో కలిసి హనుమకొండలోని అమృత థియేటర్‌లో రైతన్న చిత్రాన్ని చూసేందుకు వెళ్లారు. అయితే సరిగ్గా సినిమా ప్రారంభం అవుతున్న సమయంతో సీఎం కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. విజయగర్జన సభ గురించి మాట్లాడే విషయమై వెంటనే హైదరాబాద్‌కు రావాలని సీఎం కేసీఆర్ చెప్పడంతో ఎర్రబెల్లి సినిమా చూడకుండానే హడావుడిగా బయటకు వచ్చారు. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఆర్. నారాయణమూర్తి తన కుటుంబ స్నేహితుడని తెలిపారు. ‘రైతన్న’ సినిమా ద్వారా రైతుల సమస్యలను ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. ఈ చిత్రాన్ని అందరూ చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు శాపంగా మారాయని దుయ్యబట్టారు. రైతులను దోచుకోవడం ద్వారా అంబానీలు అదానీలకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని తెలిపారు. 2018 ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారాయని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. మొత్తంగా ఆర్.నారాయణమూర్తితో కలిసి రైతన్న సిన్మా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి సీఎం కేసీఆర్ నుంచి ఫోన్ రావడంతో సిన్మా చూడకుండానే హుటాహుటిన బయలుదేరాల్సి వచ్చింది.

- Advertisement -