హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా ఉంది అన్నారు ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.
సదస్సుకు తొలుత అనుమతి నిరాకరించినప్పటికీ, గౌరవ హైకోర్టు జోక్యంతో సభ నిర్వహణకు అనుమతి లభించింది. అయినప్పటికీ, మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారిని సభకు హాజరుకాకుండా పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.
న్యాయస్థానం అనుమతి ఇచ్చిన కార్యక్రమానికి హాజరయ్యే నాయకులను అడ్డుకోవడం కోర్టు ఆదేశాల స్ఫూర్తిని అవమానపరచడమే కాకుండా, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరించే చర్య. చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వమే ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం దురదృష్టకరం అన్నారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా సమావేశాలు నిర్వహించడం, ప్రజల సమస్యలను ప్రస్తావించడం ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న హక్కు. అలాంటి కార్యక్రమాలను పోలీసు బలంతో అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో తగదు.యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్య, ఉపాధి వంటి సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన యువ సంగ్రామ సదస్సు పట్ల ప్రభుత్వం ఇంత అసహనం ఎందుకు ప్రదర్శిస్తోంది? యువత ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డంగా పెట్టుకుని ప్రతిపక్ష స్వరాన్ని అణిచివేయాలని ప్రయత్నిస్తోంది.ఇలాంటి నిరంకుశ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రమాదకరం. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ నాయకులను గృహ నిర్బంధం చేసిన ఘటనపై ప్రభుత్వం వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలి. అక్రమంగా నిర్బంధించిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read:అమీర్‌ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు!

