సీ ప్లైన్ (సముద్ర విమానం) ఈ రోజు(12 డిసెంబర్) రికార్డ్ సృష్టించింది. దేశంలోనే లొలిసారిగా ఈ సముద్రపు విమానం దూసుకుపోయింది. అంతేకాకుండా ఈ సీ ప్లైన్ లో ప్రధాని నరేంద్రమోదీ ప్రయాణించడం మరో విశేషం. ఈ రోజు ఉదయం అహ్మదాబాద్‌లోని సబర్మతీ నది నుంచి ధరోయ్‌కి మోదీ సముద్ర విమానంలో వెళ్లారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో పోటాపోటీగా జరుగుతున్న గుజరాత్ రెండోదఫా ఎన్నికల ప్రచారానికి నేటితో పుల్ స్టాప్ పడనుంది.
ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహ్మదాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆయన జనాన్ని ఆకర్షించడానికి ఈ సముద్ర విమానాన్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. సముద్ర విమానంలో ప్రయాణించి ధరోయ్‌కి చేరుకున్న మోదీ..మళ్లీ రోడ్డెక్కి.. అంబాజీ చేరుకున్నారు. అక్కడి అంబా మాతను దర్శించుకున్నారు.
మరోవైపు గుజరాత్ లో ఇప్పటికే 89 స్థానాలకు తొలి విడత పోలింగ్ పూర్తవగా మిగిలిన స్థానాలకు డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 18న పలితాలు వెల్లడిస్తారు. రెండో దశ ఎన్నికల ప్రచారానికి నేడు చివరిరోజు కావడంతో భాజపా, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
ఇక ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి గురించి మాట్లాడటం లేదని కాంగ్రెస్ విమర్శిస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీ కనీసం ఇలాంటి అభివృద్ధిని ఊహించి కూడా ఉండదని ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలోని అన్నిచోట్లా ఎయిర్‌పోర్టులో నిర్మించడం సాధ్యం కాదని, అందుకే వాటర్‌వేస్‌పై దృష్టిపెట్టామని, దేశంలోని 106చోట్లా వీటిని నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నామని ప్రధాని మోదీ వరుస ట్వీట్లలో వెల్లడించారు.
కాగా.. మోదీ సీప్లేన్‌ను ఉపయోగించడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ప్రధాని సీప్లేన్‌లో ప్రయాణించాలనుకోవడంలో తప్పులేదని, గుజరాత్ ప్రజలకు 22 ఏళ్ల పాలనలో బీజేపీ ఏం చేసిందనే ప్రశ్నకు దూరంగా ఉండేందుకే ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.