బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన భారత ప్రధాని నరేంద్రమోదీ తొలి ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం మయన్మార్ చేరుకున్నారు. మంగళవారం చైనా నుంచి మయన్మార్ రాజధాని నేపిడా చేరుకున్న మోదీకి అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి అధ్యక్ష భవనంలో ఆయనకు ఆ దేశ సైనిక సిబ్బంది గౌరవవందనం సమర్పించారు. మోదీ వెంట మయన్మార్ అధ్యక్షుడు టిన్ క్యా ఉన్నారు.
మూడు రోజుల పాటు ప్రధాని మయన్మార్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నేత ఆంగ్ శాన్ సూకీతో పాటు పలువురు ప్రముఖులతో మోదీ భేటీ కానున్నారు. వీరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రోహింగ్యా ముస్లింల సమస్యపై ఇరువురు అగ్రనేతలు చర్చించనున్నట్లు సమాచారం.
మయన్మార్ నుంచి రోహింగ్యాలు పొరుగు దేశాలకు వలస వెళ్లిపోవడానికి గల కారణాల గురించి మోదీ చర్చించనున్నారు. మయన్మార్ ప్రభుత్వ దళాల చేతిలో చిత్రహింసలకు గురవుతున్న రోహింగ్యాలు ప్రాణభయంతో భీతిల్లిపోతున్నారు.
బతుకు జీవుడా అంటూ పొరుగు దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం భారత్‌లో ఉన్న రోహింగ్యాలను మళ్లీ మయన్మార్‌లోకి అనుమతించాల్సిందిగా ఆంగ్ సాన్ సూకీకి మోదీ కోరనున్నట్లు తెలుస్తోంది.