ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో ఈ రోజు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అఫిడవిట్ సమర్పించగా.. అందులో ఆయన ఆస్తుల వివరాలను వెల్లడించారు. చరాస్తుల్లో అధిక భాగం ఎస్‌బీఐలోని రూ 1.27 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ మొత్తం రూ 2.51 కోట్లుగా ప్రధాని వెల్లడించారు. వీటిలో చరాస్తులు రూ 1.41 కోట్లు కాగా, స్ధిరాస్తులను రూ 1.10 కోట్లుగా చూపారు.
మోదీ చరాస్తులు 2014తో పోలిస్తే 114 శాతం పెరిగాయి. 2014లో ఆయన తన చరాస్తుల విలువ రూ 65.91 లక్షలుగా చూపారు. ప్రధాని ప్రధాన ఆదాయ వనరు వేతనం కాగా, పొదుపు ఖాతాపై వడ్డీల నుంచి ఆదాయం సమకూరుతోంది. ఇక తనపై ఎలాంటి క్రిమినల్ ఆరోపణలు లేవని, అప్పులు కూడా లేవని అఫిడవిల్‌లో పేర్కొన్నారు. చరాస్తుల్లో రూ 38,750 చేతిలో నగదు కాగా, బ్యాంకులో కేవలం రూ 4,143 బ్యాలెన్స్ ఉన్నట్టు చూపారు.
ఇక 2014లో చేతిలో నగదు రూ 32,700, బ్యాంక్ బ్యాలెన్స్ రూ 26.05 లక్షలు, రూ 32.48 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్టు అఫిడవిట్‌లో మోదీ చూపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు 2014 నుంచి 2019 వరకూ 52 శాతం పెరిగాయని అఫిడవిట్‌లో తెలుస్తోంది.