కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రయాణికులకు మరియు పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు భారీ షాక్ ఇచ్చింది. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో పాస్‌పోర్ట్ ఫీజులను సవరిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పాస్‌పోర్ట్స్ (సవరణ) నిబంధనలు 2026 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త ధరలు జూలై 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. చివరిసారిగా 2012లో పాస్‌పోర్ట్ ఫీజులను పెంచగా అప్పట్లో సాధారణ 36 పేజీల పాస్‌పోర్ట్ ధర రూ. 1,000 నుండి రూ. 1,500కి పెరిగింది. అయితే ప్రస్తుత సవరణలో అటు సాధారణ (నార్మల్) కేటగిరీతో పాటు ఇటు తత్కాల్ సేవలకు కూడా ఫీజులను గణనీయంగా పెంచారు. జూలై 1 లేదా ఆ తర్వాత సమర్పించే అన్ని దరఖాస్తులకు ఈ కొత్త రేట్లే వర్తిస్తాయని, అపాయింట్‌మెంట్ ఎప్పుడు బుక్ చేసుకున్నారనే దానితో సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఈ కొత్త ధరల ప్రకారం, 18 ఏళ్లు పైబడిన పెద్దలు కొత్త పాస్‌పోర్ట్ కోసం లేదా పాత దాని రీఇష్యూ కోసం దరఖాస్తు చేసుకుంటే, సాధారణ కేటగిరీ కింద 36-పేజీల పాస్‌పోర్ట్‌కు ఇప్పటివరకు ఉన్న రూ. 1,500 స్థానంలో ఇకపై రూ. 2,500 చెల్లించాల్సి ఉంటుంది. అదే తత్కాల్ స్కీమ్ కింద అయితే ఈ రుసుము రూ. 3,500 నుండి రూ. 5,000కి పెరిగింది. ఎక్కువ ప్రయాణాలు చేసే వారి కోసం అందించే 60-పేజీల జంబో పాస్‌పోర్ట్ ధర సాధారణ కేటగిరీలో రూ. 2,000 నుండి రూ. 3,500కి, తత్కాల్‌లో రూ. 4,000 నుండి రూ. 6,000కి చేరింది. 18 ఏళ్ల లోపు ఉన్న మైనర్ల విషయానికి వస్తే 36-పేజీల కొత్త లేదా రీఇష్యూ పాస్‌పోర్ట్ ధరను సాధారణ కేటగిరీలో రూ. 1,750 గాను, తత్కాల్‌లో రూ. 4,250 గాను ఖరారు చేశారు.
మరోవైపు, పాస్‌పోర్ట్‌లు పోగొట్టుకున్నా లేదా అవి పాడైపోయినా కొత్తవి పొందేందుకు ప్రభుత్వం జరిమానాతో కూడిన భారీ ఫీజులను విధించింది. పెద్దలు తమ 36-పేజీల పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్ కోసం సాధారణ కేటగిరీలో రూ. 5,000, తత్కాల్‌లో రూ. 7,500 చెల్లించాలి. అలాగే 60-పేజీల పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్‌కు సాధారణ కేటగిరీలో రూ. 6,000, తత్కాల్‌లో రూ. 8,500 వసూలు చేయనున్నారు. మైనర్ల కేటగిరీలో పోయిన లేదా పాడైపోయిన పాస్‌పోర్ట్‌ల స్థానంలో కొత్తవి పొందాలంటే సాధారణ స్కీమ్‌లో రూ. 4,250, తత్కాల్ కింద రూ. 6,750 చెల్లించాల్సి ఉంటుంది.
పాస్‌పోర్ట్‌లతో పాటు ఇతర అనుబంధ సేవలు, ప్రయాణ పత్రాల ధరలను కూడా కేంద్రం సవరించింది. నివాస ధృవీకరణ కోసం అత్యంత కీలకమైన పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC), సరెండర్ సర్టిఫికేట్, మరియు గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ వెరిఫికేషన్ వంటి సేవలకు భారతదేశంలో రూ. 750, విదేశాలలో అయితే 40 అమెరికన్ డాలర్లు (USD) గా ఫీజు నిర్ణయించారు. సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిటీ ధరను దేశంలో రూ. 1,000 గాను, విదేశాల్లో 50 డాలర్లు గాను ఖరారు చేశారు. అయితే, అత్యవసర సమయాల్లో జారీ చేసే ఎమర్జెన్సీ సర్టిఫికేట్‌లను భారతదేశంలో ఉచితంగానే అందించనుండగా, విదేశాలలో మాత్రం దీని కోసం 15 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే లక్షలాది మంది ప్రయాణికులపై ఈ ఫీజుల పెంపు అదనపు ఆర్థిక భారంగా మారనుంది.
Also Read:సంతోష్ కుమార్ విజన్‌పై అంతర్జాతీయ నేతల ప్రశంసలు

