ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ రోజు భేటీకానున్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సాయంత్రం 4 గంటలకు సమావేశం జరుగనుంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ అంశంపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చనున్నారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. టీకా పంపిణీ, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు వంటి ప్రధాన అంశాలపై ప్రధాని మోదీ చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సీరం ఇనిస్టిట్యూట్ కొవిషీల్డ్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్లకు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి శుక్రవారం కేంద్రం మరోసారి దేశవ్యాప్తంగా డ్రై రన్ నిర్వహించింది. ఇదిలా ఉండగా.. జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. తొలి దశలో 30 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వారియర్స్, ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వాలని యోచిస్తోంది. ఇప్పటికే దేశంలో కర్నాల్, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లోని 37 స్టోరేజ్ సెంటర్లలో వ్యాక్సిన్ నిల్వలకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్రం పూర్తి చేసింది.