కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు

1
- Advertisement -

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అస్సాం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అస్సాంలోని సిల్చార్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సిల్చార్‌లో రూ.23,550 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు భూమి పూజ చేసి వాటిని దేశానికి అంకితం చేశారు. అలాగే రూ.3,200 కోట్లకు పైగా వ్యయంతో అమలు చేయనున్న అస్సాం మేళ 3.0 అనే భారీ రహదారి మౌలిక వసతుల ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అస్సాంలో 900 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మించి, రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

అదే విధంగా ఉత్తర తూర్పు ప్రాంతంలో తొలి హైస్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించబడుతున్న రూ.22,860 కోట్ల విలువైన Shillong-Silchar Corridor ప్రాజెక్టుకు కూడా ప్రధాని భూమి పూజ నిర్వహించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతీయ వాణిజ్యం, రవాణా అభివృద్ధికి కీలకంగా మారుతుందని ఆయన అన్నారు.

అలాగే కరీంగంజ్‌ జిల్లాలోని పాథర్కండి ప్రాంతంలో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ముందురోజు ఆయన గౌహతిలో రూ.24,250 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో భారత ప్రజలకు ఇబ్బందులు తక్కువగా ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అయితే ఈ సమయంలో దేశ ప్రయోజనాలను కాపాడాల్సిన కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశంలో భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.

Also Read:రైతు రోశయ్యకు చంద్రబాబు అభినందనలు

అస్సాం ప్రజలు కాంగ్రెస్‌ను ఇప్పటికే తిరస్కరించారని, ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం కూడా కాంగ్రెస్‌కు పాఠం చెబుతోందని ఆయన వ్యాఖ్యానించారు. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతూ త్వరలోనే ఓటముల శతకాన్ని చేరుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.ఉత్తర తూర్పు ప్రాంత అభివృద్ధిని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని కూడా ప్రధాని ఆరోపించారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ బరాక్ లోయ అభివృద్ధి కోసం పెద్దగా చర్యలు తీసుకోలేదన్నారు.

ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఆ పరిస్థితిని మార్చేందుకు కృషి చేస్తోందని, బరాక్ లోయను మళ్లీ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయడానికి పలు ప్రాజెక్టులు చేపడుతున్నామని చెప్పారు. అభివృద్ధి పరంగా వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం బీజేపీ మంత్రం అని ప్రధాని పేర్కొన్నారు.

- Advertisement -