శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం

5
- Advertisement -

కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం అంశంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ (LDF) ప్రభుత్వం తన పాత వైఖరిని మార్చుకుని, 50 ఏళ్లలోపు మహిళలను ఆలయంలోకి అనుమతించకూడదని సుప్రీంకోర్టుకు తెలియజేయాలని నిర్ణయించింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మార్చి 13న జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో, ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసే ట్రావెన్ కోర్ బోర్డు తీసుకున్న తీర్మానానికి ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం, సాధారణంగా రుతుస్రావ వయస్సులో ఉన్న మహిళలు (సుమారు 50 ఏళ్లలోపు) అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించకూడదనే సంప్రదాయాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం మార్చి 14లోగా ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుంది. 2018లో సుప్రీంకోర్టు అన్ని వయస్సుల మహిళలకు ఆలయంలో ప్రవేశం కల్పించాలనే తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై విచారణ ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ విచారణను ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ విచారించనుంది.

ఆలయ నిర్వహణ సంస్థ అయిన ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు కూడా శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలను కాపాడటం తమ బాధ్యత అని పేర్కొంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read:రైతు రోశయ్యకు చంద్రబాబు అభినందనలు

- Advertisement -