‘యాస్’ తుపానుపై ప్రధాని మోదీ సమీక్ష..

217
pm modi
- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుపాను పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించవచ్చని వాతావరణ విభాగం చెబుతోంది. ఈ హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడుపై యాస్ ప్రభావం చూపిస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘యాస్’పై ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ), టెలికం, విద్యుత్, పౌర విమానయాన శాఖ, ఎర్త్ సైన్సెస్ శాఖల కార్యదర్శులతో భేటీ అయిన ఆయన.. తుపాను పరిస్థితులను తెలుసుకున్నారు. హోం మంత్రి అమిత్ షాతో పాటు ఆయా శాఖల మంత్రులూ సమావేశానికి హాజరయ్యారు.

వీలైనంత త్వరగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అందుకు తుపాను ప్రభావిత రాష్ట్రాలతో అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయించుకోవాలని అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత కార్యకలాపాల్లో పాల్గొనే వారిని వేగంగా తరలించాలని ప్రధాని చెప్పారు. విద్యుత్ సరఫరాల్లో అంతరాయాలు లేకుండా చూసుకోవాలని, కోతలు విధించాల్సి వస్తే వీలైనంత తక్కువ కోతలు పెట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. ఫోన్ లైన్లలో అంతరాయం లేకుండా చూసుకోవాలని టెలికం అధికారులకు చెప్పారు. కరోనా చికిత్స, టీకా కార్యక్రమాలపై ప్రభావం పడకుండా చూడాలన్నారు.

- Advertisement -