మహాత్మాగాంధీ పేరు కాదు ఓ మార్గం. విశ్వాసం,కార్యాచరణ,ప్రజాకర్షణ అనే మూడింటిని తన జీవితంలో భాగస్వామ్యం చేసుకుని ప్రజల మన్ననలు పొందిన మహానీయుడు మహాత్మ గాంధీ. ఓ వైపు స్వాతంత్ర్య పోరాటం కొనసాగిస్తూనే మరోవైపు శాంతి సామరస్యాల కోసం ఉద్యమించిన రాజకీయ వేత్త. మార్పు కోసం సాగే పోరులో నీతి,అహింస,ప్రజాస్వామ్య హక్కులు ముఖ్యమని చాటిచెప్పిన నిరాండబరుడు గాంధీ. ప్రపంచ వ్యాప్తంగా గాంధీ సిద్ధాంతాలతో స్పూర్తి పొందిన మహానీయులు ఎందరో.
ఇవాళ మహాత్మా గాంధీ , దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖులు వారి సమాధుల వద్ద నివాళులర్పించారు. రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్ వద్ద రామ్‌నాథ్ కోవింద్, మోదీ, సోనియా గాంధీ.. పుష్పాంజలి ఘటించారు.
మహాత్మాగాంధీ 152వ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లాల్ బహదూర్ శాస్త్రీ కుమారుడు అనిల్ శాస్త్రి పాల్గొన్నారు.