కేంద్ర మంత్రి చేసిన డ్యాన్స్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫిదా అయ్యారు. ఈరోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తన సొంత రాష్ట్రం అరుణాచల్‌లో పర్యటించిన సందర్భంగా సంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్నారు. వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కిరణ్ రిజిజు కజలాంగ్ గ్రామానికి వచ్చారు. అక్కడి సజోలాంగ్ తెగ ప్రజలతో కలిసి ఆడిపాడారు. స్థానికులు సంగీత వాద్యాలు మోగిస్తూ జానపద గీతాలు ఆలపిస్తుండగా, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఉత్సాహంగా కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ఈ క్రమంలో ఈ డాన్స్ ప్రధాని దృష్టిని ఆకర్షించింది. మంత్రి డ్యాన్స్ చూసిన వెంటనే ప్రధాని స్పందించకుండా ఉండలేకపోయారు. ‘‘రిజుజు ఓ మంచి డ్యాన్సర్’’ అని కొనియాడుతూ ట్వీట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని అద్భుతమైన సంస్కృతిని చూడడం చాలా బాగుంది’’ అని మోదీ పేర్కొన్నారు.
సుందరమైన కజలంగ్ గ్రామంలోని వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్ట్స్ పర్యవేక్షణకు వెళ్లానని, ఆ గ్రామానికి ఎవరైనా అతిథులు వస్తే అక్కడి సజోలంగ్ ప్రజలు ఇలాగే ఉత్సాహంగా ఆహ్వానిస్తారని మంత్రి పేర్కొన్నారు. జానపదాలు, డ్యాన్స్‌లు దానికి మరింత అందాన్ని జోడిస్తాయన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రతీ తెగలోనూ ఇలాంటి ఆచారాలే ఉంటాయని కేంద్ర మంత్రి రిజుజు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.