తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు గుప్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనాపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కేంద్రమంత్రి హర్షవర్ధన్‌తో ఫోన్‌లో మాట్లాడి పలు సూచనలు, రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత, టీకాల అంశంపై చర్చించారు. అనంతరం కేసీఆర్ చేసిన సూచనలను ప్రధానికి వివరించారు కేంద్రమంత్రి హర్షవర్ధన్.
దీంతో ఈ సూచనలు విన్న ప్రధాని….సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మీది మంచి ఆలోచన, మీ సూచనలు చాలా బాగున్నాయి వాటిని తప్పకుండా ఆచరణలో పెడుతాం అంటూ ప్రధాని…. సీఎంను అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మరింతగా ఆక్సీజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని కేసీఆర్ చేసిన విజ్జప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు.
దేశంలో అందరికీ వ్యాక్సిన్ వేయాలంటే 270 కోట్ల డోసులు కావాలి. సత్వరమే అంత ఉత్పత్తి చేసే లేదా దిగుమతి చేసుకొనే సామర్థ్యం మనకు లేదు. ఆటో డ్రైవర్లు, క్యాబ్‌డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కూరగాయలు, కిరాణా వ్యాపారులు, ఎయిర్‌పోర్టు సిబ్బంది, సేల్స్‌మన్, గ్యాస్ డెలివరీ బాయ్స్, అడ్డా కూలీల సేవలను మనం ఆపలేం. వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటున్నది. అందువల్ల ప్రాధాన్య క్రమంలో వీరికి ముందుగా టీకా వేస్తే కరోనా వ్యాప్తిని చాలావరకు అరికట్టవచ్చని వెల్లడించారు కేసీఆర్.