దేశ రాజధానిలో జరిగిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టం కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదని, సామాజిక న్యాయం నినాదంగా కాకుండా భారతీయ సంస్కృతిలో సహజ భాగమయ్యేలా చేసే ఒక గొప్ప సంకల్పమని ఆయన అభివర్ణించారు.
ఏప్రిల్ 16 నుంచి ప్రారంభం కానున్న మూడు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ చట్టం (నారీ శక్తి వందన్ అధినియం) సవరణలపై చర్చించి, పార్లమెంట్ చరిత్ర సృష్టించబోతోందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఏది ఏమైనా 2029 నాటికి అమలు చేయాలనేది అందరి ఏకగ్రీవ డిమాండ్ అని, ఆ లక్ష్యం దిశగానే ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో సమగ్ర చర్చ జరుగుతుందని ప్రధాని తెలిపారు.
రాష్ట్రపతి నుంచి ఆర్థిక మంత్రి వరకు దేశంలో మహిళలు కీలక పదవులను అలంకరించి చరిత్ర సృష్టించారని, ప్రస్తుతం స్థానిక సంస్థల్లో 14 లక్షల మందికి పైగా మహిళలు విజయవంతంగా సేవలు అందిస్తున్నారని మోదీ కొనియాడారు.
నిర్ణయాధికార ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల వ్యవస్థల్లో సున్నితత్వం, జవాబుదారీతనం పెరుగుతుందని వివిధ అధ్యయనాలు నిరూపించాయని ఆయన పేర్కొన్నారు.సుమారు 21 రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు 50 శాతానికి చేరుకుందని, ఈ విషయం తెలిసిన విదేశీ ప్రతినిధులు సైతం ఆశ్చర్యపోతున్నారని ప్రధాని గర్వంగా చెప్పారు.
ALso Read:వరుణ్ తేజ్..’కొరియన్ కనకరాజు’!

