ఉత్తరాఖండ్‌లో భారీ మంచుకొండ విరిగిపడింది. దీంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. చమోలి జిల్లాలో నందాదేవి గ్లేసియర్ విరిగి ధౌలిగంగా నదిలో పడటంతో ఆకస్మిక వరద పోటెత్తింది. దీని కారణంగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, రిషికేష్‌లతోపాటు యూపీలో గంగా పరివాహక ప్రాంతాలలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఇవాళ అసోం పర్యటనలో ఉన్న ఆయన ఉత్తరాఖండ్‌లో వరదల గురించి తెలియగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
రక్షణ, పునరావాస చర్యలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం మీడియాకు వెల్లడించింది. ప్రస్తుతం అధికారులు పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారని ప్రధాని కార్యాలయం తన ప్రకటనలో పేర్కొన్నది. గంగానది పరీవాహక ప్రాంతాల్లోని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.