గుజరాత్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మోడీ భగ్గుమన్నారు. పెద్ద నోట్ల రద్దుపై చర్చకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించినా .. పార్లమెంట్‌లో తనను మాట్లాడనివ్వడంటూ లేదంటూ తీవ్రస్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకే తాను జనసభను ఎంచుకున్నట్టు మోడీ ప్రకటించారు. నల్లధనం ఉన్న ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తిలేదని గుజరాత్ బహిరంగ సభలో మరో సారి మోడీ స్పష్టం చేశారు.
నోట్ల రద్దుపై విపక్షాల వరుస ఆందోళనలు, పార్లమెంట్ వాయిదాల పర్వంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. గుజరాత్‌లోని దీసాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మోడీ…అవినీతి, నల్ల డబ్బు, నకిలీ కరెన్సీలకు వ్యతిరేకంగానే తాను ఈ పోరాటం ప్రారంభినట్టు తెలిపారు. తాను తీసుకున్న నిర్ణయంతో దేశంలోని పేదలకు ఖచ్చితంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్న విపక్షాల ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నా.. తనను సభలో మాట్లాడనివ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల ప్రశ్నలకు బదులు ఇచ్చేందుకు జనసభ నుంచి మాట్లాడుతున్నట్టు ప్రధాని ఈసందర్భంగా ప్రకటించారు.
అక్రమమార్గాల్లో డబ్బు మార్చుకుంటున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమంటూ మోడీ ప్రకటించారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందునే నిజానిజాలు చెప్పేందుకు తాను జనం ముందుకు వచ్చానన్ని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పార్లమెంటు సమావేశాలు సాగుతున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేసినా విపక్షాల తీరు మారలేదంటూ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను విమర్శించడంలో ముందున్న విపక్షాలు … ప్రజలను ఆదుకోవడంలో కూడా ఇదే విధంగా ఉండాలంటూ హితవు పలికారు. బ్యాంకులు, ఏటీఎంలు వద్ద క్యూ కడుతున్న ప్రజలకు.. బ్యాంకింగ్, నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించి సాయపడాలంటూ విపక్ష సభ్యులకు చురకలంటిచారు. ప్రజలు కూడా బ్యాంకులు, ఏటీఎంల ముందు నిలబడి సమయాన్ని వృథా చేసుకోకుండా ఆన్‌లైన్‌లో నగదురహిత లావాదేవీలు జరపాలని మోడీ పిలుపునిచ్చారు.
దేశంలో ప్రజల కష్టాలను తీర్చేందుకు వీలుగా వంద రూపాయల నోట్లను అందుబాటులోకి తెచ్చినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివరించారు. నోట్ల రద్దు సమయంలో తాను చెప్పినట్టుగానే 50 రోజులు ఇబ్బందులు తప్పవని .. ఆ తరువాత అంతా మంచే జరుగుతుందంటూ భరోసా ఇచ్చారు. నవంబరు 8 తర్వాత పెద్ద నోట్ల కోసం ఎవరూ చూడడం లేదని. చిన్ననోట్ల కోసం పోటీ పడుతున్నారన్నారు మోడీ అన్నారు.