హైదరాబాద్ నగరవాసుల కల నేరవేరింది. అత్యుత్తమ టెక్నాలజీతో ఏర్పాటైన హైదరాబాద్ మెట్రో రైలు లాంఛనంగా ప్రారంభమైంది. మియాపూర్‌లో పైలాన్‌ను ఆవిష్కరించిన మోడీ…మెట్రోను జాతికి అంకితం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన మోడీ… మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు, తిరిగి కూకట్ పల్లి నుంచి మియాపూర్ వరకు ప్రయాణం చేశారు.
గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి,లక్ష్మణ్‌లతో కలిసి మెట్రో ప్రయాణించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మెట్రో ప్రత్యేకతలను వివరించారు కేటీఆర్. వీరు ప్రయాణించిన మెట్రోను నడిపింది అమ్మాయి కావడం విశేషం.
మెట్రో రైళ్లను ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ చిత్రాలతో పాటు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ, బోనాలు, వరంగల్ వెయ్యి స్తంభాల గుడి, రామప్ప, చార్మినార్, గోల్కొండ వంటి చిత్రాలతో అందంగా ముస్తాబు చేశారు.
మెట్రో ప్రత్యేకతలు..
-ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ(ప్రయివేటు పబ్లిక్ పార్టనర్‌షిప్) ప్రాజెక్టు
-దేశంలోనే నిర్మితమైన అతి పెద్ద మెట్రో వ్యవస్థ
-దేశంలోనే మొట్టమొదటి సారిగా ఒకేసారి అందుబాటులోకి 30 కిలోమీటర్ల నెట్‌వర్క్
-ఎయిర్ కండీషన్డ్ సౌకర్యంతో ఆహ్లాదకరమైన, వేగవంతమై, సురక్షితమైన ప్రయాణం
-అధునాతనమైన కోచ్‌లు
-ఐజీబీసీ(ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) గుర్తింపు
-వినియోగదారులకు పూర్తి అనుకూలమైన 24 స్టేషన్లు
-దేశంలోనే అతిపెద్ద ఎలివేటెడ్ స్టేషన్‌గా అమీర్‌పేట
-ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్స్(ఏటీవీఎం). ఇవి క్యూలు, కౌంటర్ల వద్ద నిరీక్షణ కాలాన్ని తగ్గిస్తాయి
-కాలుష్య రహిత, పర్యావరణ అనుకూలమైన ప్రయాణం – కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటుగా ఇంధన వినియోగం, కాలుష్యం కూడా తగ్గిస్తుంది.
#WATCH PM Modi, along with Telangana CM KC Rao & Guv ESL Narasimhan, takes a ride in the newly inaugurated #HyderabadMetro pic.twitter.com/xLMtrTkGYO
— ANI (@ANI) November 28, 2017