రైతన్నకు అండగా, అన్నదాతకు భరోసాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మక రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏడాదికి రూ.10000 అందింస్తోంది. ఈ పథకం దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపును పొందింది. అయితే ఇదే తరహాలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పేరుతో కేంద్రం అమలు చేసింది. ఈ పథకం కింద 5 ఎకారల లోపు భూమి కలిగి ఉన్న సన్నకారు రైతులకు ఎడాదికి 6వేల రూపాయాలు అందించనుంది. ఈ పథకం అమలుపై కేంద్రం ప్రభుత్వం చక చక అడుగులు వేస్తోంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను విడుదల చేసింది.
లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా ప్రదర్శించనున్నట్టు స్పష్టంచేసింది. అర్హుల పేర్లు జాబితాలో లేకుంటే విన్నవించుకోవచ్చని తెలిపింది. ఫిబ్రవరి 25నాటికి రాష్ట్రంలో ఉన్న అర్హులైన చిన్న, సన్నకారు రైతుల జాబితాను సిద్ధం చేసి పీఎం-కిసాన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. మొదటి విడుత సొమ్మును ఏడాదిలో ఎప్పుడైనా పొందేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 25 తర్వాత వివరాలు అప్‌లోడ్ చేసినా ఏడాదిలో ఎప్పుడైనా సొమ్మును ఖాతాలో జమచేస్తారు. అయితే ఈ పథకం కింద ఐదెకరాల్లోపు ఉన్న ఒక కుటుంబం మాత్రమే రూ. 6వేలు పొందడానికి అర్హులుగా నిర్ధారించారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అనర్హులు: ఉన్నతాదాయవర్గాల వారు,వేర్వేరు ప్రాంతాల్లో వివిధ సంస్థల కింద ఐదెకరాల లోపు భూమి ఉన్న వారు ,రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే వర్తించదు, తాజా, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ తాజా, మాజీ చైర్మన్లుకు వర్తించదు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల అధికారులు.. నాలుగో తరగతి ఉద్యోగులకు మినహాయింపు, రూ.10వేల మించి పింఛన్ తీసుకునే ఉద్యోగులు, గతేడాది ఐటీచెల్లించిన వారు.
ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఈ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి వసుధామిశ్రా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కోరారు. కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మొదట తెలంగాణ ప్రభుత్వమే అమలు చేస్తుందని, రైతుబంధు తరహాలో విజయవంతంగా నిర్వహిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఇటివల వసుధామిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కుటుంబం యూనిట్(భర్త,భార్య, మైనర్ పిల్లలు)గా అమలవుతుంది. రైతుల ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ చేస్తాం. ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డుతో పాటు బ్యాంక్ ఖాతాల వివరాలు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా అమలు చేయాలని కోరాం. కిసాన్ సమ్మాన్ నిధికి రైతుబంధుకు సంబంధం లేదు. కేంద్ర పథకం చిన్న, సన్నకారు రైతులకే వర్తిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం రైతులందరికీ అమలవుతోంది’’ అని ఆమె వెల్లడించారు.