పినాక రాకెట్…గేమ్​ ఛేంజర్​!

5
- Advertisement -

భారత రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి నమోదు అయ్యింది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ‘పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ (LRGR 120)’ తొలి గగనతల పరీక్ష సూపర్ సక్సెస్‌గా ముగిసింది. ఒడిశా తీరంలోని చండీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) వేదికగా నిర్వహించిన ఈ ప్రయోగంలో రాకెట్ అత్యంత కచ్చితత్వంతో తన నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో పినాక రాకెట్ వ్యవస్థ భారత సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే గేమ్‌ ఛేంజర్‌గా నిలిచింది.

డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ఆధునిక నావిగేషన్, మార్గనిర్దేశక సాంకేతికతతో సజ్జమైంది. దీని ద్వారా దీర్ఘ దూరంలో ఉన్న శత్రు లక్ష్యాలను అత్యంత ఖచ్చితంగా ధ్వంసం చేసే సామర్థ్యం లభిస్తుంది. పరీక్ష సందర్భంగా రాకెట్ ప్రయాణ మార్గం, వేగం, దిశ నియంత్రణ, లక్ష్య ఛేదన వంటి అన్ని ప్రమాణాలు విజయవంతంగా నమోదు అయ్యాయి.

ఈ విజయం భారతదేశం స్వావలంబన రక్షణ రంగంలో సాధించిన మరో గొప్ప అడుగుగా భావిస్తున్నారు. ‘మేకిన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేయబడింది. పినాక LRGR విజయవంతం కావడంతో భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధ వ్యవస్థ లభించనుంది. భవిష్యత్తులో మరిన్ని పరీక్షల అనంతరం దీనిని సైన్యంలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి.

Also Read:న్యూజిలాండ్‌తో సిరీస్‌..బుమ్రా,హార్దిక్‌కు విశ్రాంతి!

- Advertisement -