ముంబై ఇండియన్స్ జట్టు 2026 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) సీజన్‌కు గాను క్రిస్టెన్ బీమ్స్‌ను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు అధికారికంగా ప్రకటించింది. లెగ్ స్పిన్నర్ అయిన క్రిస్టెన్ బీమ్స్ ఆస్ట్రేలియా జట్టుకు అన్ని మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహించారు. ఆమె అంతర్జాతీయ కెరీర్‌లో 1 టెస్ట్, 30 వన్డేలు, 18 టీ20 మ్యాచ్‌లు ఆడారు. 2017 వన్డే వరల్డ్‌కప్‌లో మూడవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. అలాగే ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL)లో 45 మ్యాచ్‌ల్లో పాల్గొని, ఆట నుంచి విరమించారు.
రిటైర్ అయిన తర్వాత కోచింగ్ వైపు అడుగుపెట్టిన బీమ్స్, WBBLతో పాటు ది హండ్రెడ్ టోర్నీలో కూడా పని చేశారు. ఆస్ట్రేలియా ఉమెన్స్ అండర్-19 జట్టు కోచ్‌గా సేవలందించడంతో పాటు, క్రికెట్ ఆస్ట్రేలియాలో నేషనల్ డెవలప్‌మెంట్ లీడ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల క్రికెట్ టాస్మేనియాలో కమ్యూనిటీ క్రికెట్ మేనేజర్ – సౌత్‌గా పనిచేశారు.
రెండుసార్లు WPL ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో, బీమ్స్ ప్రధాన కోచ్ లీసా కైట్‌లీ నేతృత్వంలోని సహాయక సిబ్బందిలో చేరనున్నారు. ఈ సపోర్ట్ స్టాఫ్‌లో బౌలింగ్ కోచ్, మెంటార్ ఝులన్ గోస్వామి, బ్యాటింగ్ కోచ్ దేవిక పాల్షికర్, ఫీల్డింగ్ కోచ్ నికోల్ బోల్టన్ కూడా ఉన్నారు.
Also Read:బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా కన్నుమూత
ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో స్పందించిన బీమ్స్, ఝులన్ గోస్వామి లాంటి గొప్ప క్రికెటర్‌తో కలిసి పని చేయడం నాకు లభించిన అద్భుత అవకాశం. ఆమెతో నేను ఒకప్పుడు ఎదురెదురుగా క్రికెట్ ఆడాను. ముంబై ఇండియన్స్‌లో ఎన్నో ఏళ్లుగా విజయాల సంస్కృతి, కుటుంబ వాతావరణం నెలకొని ఉంది. అంతగా కలిసికట్టుగా ఉన్న జట్టులో భాగమవడం ఎంతో ఆనందంగా ఉంది. కోచ్‌గా అలాంటి వాతావరణంలోకి రావడం నిజంగా ప్రత్యేకం అని అన్నారు.

