ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతికాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్యవిద్య లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ‘యు వరల్డ్’ పేరుతో ఆన్‌లైన్ శిక్షణ సంస్థను ప్రారంభించి, స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్‌లైన్ శిక్షణిస్తూ అతికొద్దికాలంలోనే రూ.వేల కోట్లకు ఎదిగింది. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయన్ను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. క్యాబినెట్ ఎంపికలో తొలుత 10 స్థానాల కంటే ఎక్కువచోట్ల గెలిచిన పార్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని, ఈ నేపథ్యంలో తెదేపాకు తొలుత రెండు మంత్రి పదవులు ఇస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో మరో 2 మంత్రి పదవులు వస్తాయని తెదేపా వర్గాలు చెబుతున్నాయి.
పెమ్మసాని చంద్రశేఖర్
జన్మస్థలం: బుర్రిపాలెం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా
వయసు: 47
విద్యార్హత: ఎంబీబీఎస్, ఎండీ (ఇంటర్నల్ మెడిసిన్)
తల్లిదండ్రులు: సువర్చల, పెమ్మసాని సాంబశివరావు
భార్య: డాక్టర్ శ్రీరత్న, కుమారుడు, కుమార్తె
చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపారరీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా నరసరావుపేట ప్రాంత వాసులకు చిరపరిచితులు. చంద్రశేఖర్ ఎంసెట్లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. పీజీ చదివేందుకు అమెరికా వెళ్లిన ఆయన అక్కడ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పూర్తి చేయడంలో వసతి, శిక్షణకు అధిక వ్యయభారం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో జనరల్ గైసింగర్ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటారు. అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ పేరుతో ఆన్‌లైన్ శిక్షణ సంస్థను స్థాపించారు. అమెరికాలోని డాలస్‌లో పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు. తొలి నుంచి తెదేపాతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్ ఎన్నారై విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు.
Also Read:మంచి ఆరోగ్యం కోసం మంచి ఆహారం..