ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం మరో కొత్త అవతారమెత్తబోతోంది. నోట్ల రద్దు తర్వాత మనీ ట్రాన్స్ ఫర్,లావాదేవీలతో పేటీఎం రేంజ్ పెరిగిపోయింది. గల్లీలో చిన్న కొట్టు దగ్గరి నుంచి బడా మాల్స్ వరకు పేటీఎం బోర్డులు వెలిశాయి. ఛాయ్ వాలా నుంచి సినిమా హాల్ వరకు పేటీఎం కస్టమర్లు పెరిగిపోయారు.
పెరిగిన కస్టమర్లకు మరింత ధీమా అందించేందుకు వివిధ రకాల ఆఫర్లను ప్రవేశ పెట్టిన పేటీఎం తాజాగా బ్యాంకుగా మారబోతోంది. పేటీఎం బ్యాంకు త్వరలో పట్టాలపైకి రానుంది.
మే 23 నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగించేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కు ఆర్‌బీఐ తుది అనుమతులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని బ్యాంకు పబ్లిక్ నోటీస్‌లో తెలియజేసింది. ఈ బ్యాంకు లైసెన్స్ విజయ శేఖర్ శర్మ పేరుతో మంజూరైంది. దీంతో కంపెనీ తన ఈ వాలెట్ వ్యాపారాన్ని ఈ బ్యాంకుకు బదిలీ చేయనుంది. దీనికి ఇప్పటికే 21.8 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
మే 23 తర్వాత నుంచి పేటీఎం వాలెట్ పీపీబీఎల్‌లో భాగమవుతుంది. ఒక వేళ వినియోగదారులకు ఈ విషయం ఇష్టం లేనట్లైతే పేటీఎంకు తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు పేటీఎం ఈ వాలెట్లోని బ్యాలెన్స్ వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుంది.
ఈ విషయాన్ని మే 23 కంటే ముందే తెలియజేయాల్సి ఉంది. ఆరునెలల నుంచి వినియోగించని ఈ వాలెట్‌లోని మొత్తాలను వినియోగదారుల అనుమతితోనే పీపీబీఎల్‌లోకి మారుస్తారు. దీంతోపాటు పేటీఎం బ్యాంక్ రూ.లక్ష వరకు డిపాజిట్లను నేరుగా స్వీకరిస్తుంది.