జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు జనసైనికులు, వీర మహిళలు, రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే అందరూ ఆహ్వానితులేనని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 14న జరగనుంది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ ఓ వీడియో రూపంలో అందరికీ ఆహ్వానం పలికారు. జనసేన పార్టీ స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని, మార్చి 14న 9వ ఏట అడుగుపెడుతోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో, పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని ఇప్పటం గ్రామం వద్ద జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమానికి జనసైనికులు, వీర మహిళలు, రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే అందరూ ఆహ్వానితులేనని తెలిపారు.
సభకు వచ్చేవారికి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో ఇది మా హక్కు అని చెప్పాలని పిలుపునిచ్చారు. ఇది మన ఆవిర్భావ దినోత్సవం, ఇది మన హక్కు… ఎవరూ భయపడాల్సిన పనిలేదు అని ఉద్ఘాటించారు. పోలీసు శాఖ వారు కూడా సహకరించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. గతంలో తమపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికీ, సందేహాలు వ్యక్తం చేసినవారికి రేపు సభాముఖంగా సమాధానం చెబుతానని అన్నారు. అందరూ తమ తమ ప్రాంతాల నుంచి క్షేమంగా ఇక్కడికి చేరుకుని సభను జయప్రదం చేయాలని కోరుతున్నట్టు వెల్లడించారు.