అధికార పక్షంలో ఉన్న పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిన పక్షంలో, ప్రజల ముందు తప్పు ఒప్పుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చే పరిస్థితులు లేకపోవచ్చని, అలాంటప్పుడు, ప్రజలకు విషయం చెప్పాలని సూచించారు. ప్రత్యేక హోదా వంటి అంశాలపై వాస్తవాలను ప్రజల ముందు బయట పెట్టాలని కోరారు. ఏ పరిస్థితుల్లో ఆ హామీని నెరవేర్చుకోలేదో వెల్లడించకుంటే, మరోసారి ఓట్లు అడిగే హక్కును కోల్పోతారని హెచ్చరించారు.
ఏ పార్టీ పేరునూ వెల్లడించకుండా మాట్లాడిన ఆయన, గొప్ప ఆశయాలతో, తాము చేయదలచుకున్న పనులతో మ్యానిఫెస్టోలను రాజకీయ పార్టీలు తయారు చేస్తుంటాయని, కొన్ని హామీలు నెరవేర్చే దిశలో కోర్టులు కూడా అడ్డు పడతాయన్న విషయం తనకు తెలుసునని చెప్పారు. తనకు ఎవరిపైనా ఆగ్రహం, ద్వేషం లేదని చెప్పిన ఆయన, అభివృద్ధే తనకు ధ్యేయమని చెప్పారు.
రాయలసీమ సమస్యల సత్వర పరిష్కారానికి ఓ మెమొరాండం తీసుకుని తాను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లనున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మంత్రి పరిటాల సునీత ఇంటికి వచ్చిన ఆయన, ఆమెతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను అనంతలో కేవలం మూడు రోజుల పర్యటనకు మాత్రమే పరిమితం కాదని, ఇకపై పదే పదే ఇక్కడికి వస్తానని చెప్పిన ఆయన, సీమ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపైనా స్పందిస్తానని తెలిపారు.
తన టీమ్ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి, వాళ్ల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోందని, వారిచ్చే రిపోర్టును బట్టి, వెంటనే స్పందించాల్సిన సమస్యల వివరాలు తీసుకుని మోదీ వద్దకు వెళతానని ఆయన తెలిపారు. సీమలోని ప్రతి జిల్లాకూ తాగు నీరు అందించడం తన తొలి లక్ష్యమని తెలిపారు. ఇదే సమావేశంలో పాల్గొన్న పరిటాల సునీత మాట్లాడుతూ, పవన్ తన ఇంటికి అతిథిగా రావడం ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. జిల్లా సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయని, పవన్ ఇచ్చే సలహా, సూచనలనూ తీసుకుంటామని తెలిపారు.